సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ ): బడ్జెట్ ముసాయిదాపై జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్‌ను ‘ఏ’ కేటగిరీగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులను ‘బీ’గా చూపనున్నది. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6,224 కోట్లుగా చూపగా..వచ్చే బడ్జెట్ కూడా దాదాపు రూ.6500కోట్ల మేర ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ ఆదాయం, ఖర్చులు, సర్ప్లస్ రెవెన్యూ, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా రాబడి, పట్టణ ప్రగతి, టౌన్‌ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం, అప్పులు, ఇతర ఆదాయం తదితర అంశాలపై పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో బల్దియాకు కేటాయించాల్సిన నిధులపై సోమవారం పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ కమిషనర్ రోనాల్డ్‌రాస్ నుంచి వివరాలు అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ రెండో దశ అధిక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిసింది.