సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తు ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక మార్పును తీసుకొచ్చింది. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్ల డిమాండ్ల పెంపులో భాగంగా అనుమతి లేని నిర్మాణాల క్రమబద్ధీకరణకు నేటి నుంచి మార్గం సుగమమైంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయగా..మంగళవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నదని జీహెచ్ఎంసీ పట్టణా విభాగం అధికారులు తెలిపారు. ఇప్పటివరకు టీడీఆర్ సర్టిఫికెట్ల వినియోగమనేది అదనపు అంతస్తులకు మాత్రమే పరిమితమైంది. అంటే… ఒక ప్రాంతంలో నాలుగు అంతస్తుల వరకు అనుమతి ఉన్నట్లయితే… ఐదో అంతస్తు నిర్మాణానికి టీడీఆర్‌ను వినియోగించుకోవచ్చు.
నిబంధనల ప్రకారమయ్యే అనుమతి ఫీజుకు సమానమైన టీడీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం చట్టంలో సవరణ చేసింది. ఈ మేరకు ముందస్తు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణ క్రమబద్ధీకరణకు కూడా టీడీఆర్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు.