GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన కౌన్సిల్ దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్నది. అసలే ఎన్నికల ఏడాది కావడం…గడిచిన ఏడాది కాలంగా అభివృద్ధి పనులు కుంటుపడడం..రోజూరోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతున్న దరిమిలా అన్ని పార్టీల సభ్యులు ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి అలుముకున్నది. మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది.
కౌన్సిల్లో బలంగా బీఆర్ఎస్..
కౌన్సిల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపేందుకు సిద్ధ్దమయ్యారు. ఏడాది కాలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పురోగతిలో ఉన్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఏడాది కాలంగా కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, వీధి లైట్ల నిర్వహణ లోపాలు, బడ్జెట్ కేటాయింపుల ప్రధాన అస్ర్తాలుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎండగట్టనున్నారు. ఇటీవల గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా కమిషనర్ ఇలంబర్తిని కలిసి నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్‌లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డిపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. కాగా, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. అటెన్షన్ డైవర్షన్ విధానాన్నే అవలంభించాలని వారికి చెప్పినట్లు తెలుస్తున్నది. కాగా, మేయర్ మాత్రం ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8440 కోట్ల బడ్జెట్‌ను ఆమోదింపజేయడమే లక్ష్యంగా సభ నిర్వహణ జరిపే ఆస్కారం ఉందన్న చర్చ ఉంది.
సభ సజావుగా సాగేనా?
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నది. తొలుత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత మేయర్ బడ్జెట్ ప్రసంగం ఐదు నిమిషాల పాటు ఉండనున్నది. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8440 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి చర్చ పెట్టనున్నారు. అయితే బడ్జెట్ ప్రసంగంపై చర్చ ఏ మేర జరుగుతుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కౌన్సిల్ సందర్భంగా వివిధ పార్టీల సభ్యుల నుంచి 125 ప్రశ్నలు రాగా..అందులో 19 ప్రశ్నలను మాత్రమే ఎంపిక చేశారు.