సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంటున్నది. డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం సేకరించి స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో జాతీయ అవార్డుకు జీహెచ్ఎంసీని ఎంపిక చేసింది. 2023 సంవత్సరంలో గార్బేజీ ఫ్రీ సిటీలో ఇప్పటికే త్రీ స్టార్ సిటీ ర్యాంకింగ్ జాబితాలో ఉండగా, తాజాగా 5 స్టార్ రేటింగ్‌తో జాతీయ అవార్డును సాధించింది. ఈ నెల 11న న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అందించే జాతీయ స్థాయి అవార్డుల ప్రదానానికి జీహెచ్ఎంసీకి శనివారం ఆహ్వానం అందింది. కాగా జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందని, ఈ అవార్డు దక్కడంలో విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మేయర్ గద్వాల్ విజయలక్షి, కమిషనర్ రొనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలిపారు.