సిటీబ్యూరో: హోటళ్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు తెలిసొస్తున్నాయి. తాజాగా కొంపల్లిలో ఉలవచారు హోటల్లో ఫుడ్ లైసెన్స్ ప్రదర్శనలో లేకపోవడం, కుళ్లిపోయిన టమాటాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీల్లో తేలింది. వంటగది అపరిశుభ్రంగా ఉందని, ఫ్రిజ్లో చికెన్, మటన్ పచ్చి మాంసాన్ని కలిపి ఉంచినట్లు గుర్తించారు. కొంపల్లిలో ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో అపరిశుభ్రంగా వంటగది ఉందని, వెజ్ అండ్ నాన్వెజ్ కలిపి ఫ్రిజ్లో పెట్టారని తేల్చారు. మల్నాడ్ కిచెన్ స్టోరేజీలో పలు చోట్ల ఎలుకల మలమూత్రాలను ఉన్నట్లు గుర్తించారు. వంటగది, ఫ్లోరింగ్లు అస్సలు శుభ్రంగా లేవని, సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నారని, గోడలు జిడ్డుగా ఉన్నాయని, టైల్స్ విరిగిపోయాయని అధికారులు తెలిపారు. సంబంధిత నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు జరిమానాలు విధించారు.