సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కేశవ్‌నగర్‌లో ఓ ఇంటి యాజమాని (ఇంటి నంబరు 12-7-112/7/3) రెండతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణ పనులు జరుపుతున్నారు. భవన నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఈ భవనం నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులను ముడుపులు అందినట్లు ప్రచారం ఉంది.
మెట్టుగూడ డివిజన్ విజయ్‌పురి కాలనీలో ఓ యజమాని పాత ఇంటి స్థానంలో (ఇంటి నంబరు 12-5-74/2) నూతన నిర్మాణ పనులు జరుపుతున్నారు. ప్రస్తుతం 3అంతస్తుల వరకు పనులు జరిగాయి. ఎలాంటి అనుమతి లేదు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అందినంత దండుకున్నట్లు ఆరోపణలున్నాయి.
GHMC | సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ)/వనస్థలిపురం: జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఫిర్యాదు వస్తేనే కానీ రంగంలోకి వచ్చి అలా నోటీసులు ఇచ్చినట్టే ఇచ్చి దొడ్డిదారిలో పనులను అనుమతులు ఇస్తున్నారు.. స్వయంగా కూకట్పల్లి, ఎల్భీనగర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులు, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్లలో సీనియర్ అధికారులు జడ్సీగా వచ్చిన అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం..ఇది జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పే మాట..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాసులకు కక్కుర్తి పడుతూ అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు..ప్రమాదకరంగా నిర్మాణాలు జరుగుతున్నా కనీసం బాధ్యతగా వ్యవహరించడం లేదు..అనుమతులు ఇచ్చి వదిలేస్తున్నారు.
సెలవుదినాల్లో పనికానిస్తున్నారు..
హస్తినాపురం డివిజన్ జెడ్పీరోడ్లోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నం.3లో అక్రమ నిర్మాణం జరుగుతోంది. కే.వేణుగోపాల్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ప్రమాదకరంగా, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా..ఫలితం లేకుండాపోయింది. ఓ సారి అక్రమ నిర్మాణదారుడికి టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినా..అతడు బేఖాతరు చేసి సెలవుదినాలు, రాత్రి వేళల్లో పనులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..హస్తినాపురం డివిజన్లో జెడ్పీ రోడ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. దీంతో రహదారికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు
‘హస్తినాపురం డివిజన్లో టౌన్‌ప్లానింగ్ శాఖ తీరు వివాదాస్పదంగా ఉంటోంది. ఫోన్, వాట్సాప్, యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తే కనీసం స్పందించరు. లిఖిత పూర్వక ఫిర్యాదులకు కూడా స్పందన ఉండదు’. అని హస్తినాపురానికి చెందిన జాల శివయాదవ్ పేర్కొన్నాడు.