అవినీతి, అక్రమాలు ఒకవైపు.. కుంటుపడుతున్న నగరాభివృద్ధి మరోవైపు..అడ్డదారి పదోన్నతులు.. విధి నిర్వహణలో బాధ్యత లేమి.. ఇలా జీహెచ్ఎంసీ ‘ఇంజినీరింగ్’ విభాగం పాలన పూర్తిగా గాడితప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విభాగంలో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి రూ.7వేల కోట్లకు పైగా హెచ్సిటీ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో ఏ ఒక్క చోట పనులు పట్టాలెక్కలేదు. మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల టెండర్లలో అక్రమాలకు తెరలేపి..ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో ఇంజినీరింగ్ విభాగం నుంచి ఈ పనులు హైడ్రాకు బదలాయించారు. ఇది ‘ఇంజినీరింగ్ ’ వైఫల్యమైనని చెప్పవచ్చు. ఇలా ఈ విభాగం అస్తవ్యస్తంగా మారింది. తాజాగా ఇప్పుడు ఈఎన్సీ, సీఈ ప్రాజెక్టు పోస్టింగ్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం గాడితప్పింది. తరచూ వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సైదాబాద్‌లో రోడ్డు వేయకుండానే బిల్లు మంజూరు చేసిన వ్యవహారంలో ఇద్దరు ఇంజినీర్లపై వేటు వేయడం, లంచం తీసుకుంటూ ఇద్దరు ఏఈలు ఏసీబీకి చిక్కారు. దీనికితోడు గతేడాది డిసెంబర్లో రైజింగ్ తెలంగాణ పేరిట జరిగిన ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.7వేల కోట్లకు పైగా హెచ్సిటీ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్క చోట పనులు పట్టాలెక్కలేదు.
అంతేకాదు మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల టెండర్లలో అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో ఈ ఇంజినీరింగ్ విభాగం నుంచి ఈ పనులు హైడ్రాకు బదలాయించారు. ఒక ప్రాజెక్టు చేపట్టే ముందు భూసేకరణపై స్పష్టత ఉండాలి. కానీ ఇక్కడ హెచ్సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డీపీలు సరిగా లేకుండానే టెండర్లు పిలవడం, ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవడం వరకే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
సంబంధిత ప్రాజెక్టు విభాగం చీఫ్ ఇంజినీర్ తీరుతోనే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చర్చించుకుంటున్న తరుణంలో ఆయన వైఖరిపై ఒక వర్గం ఇప్పటికే గుర్రుగా ఉండగా, తాజాగా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి అడ్డదారిలో వచ్చిన భాస్కర్‌రెడ్డికి జీహెచ్ఎంసీలో ఈఎన్సీ, సీఈ ప్రాజెక్టు పోస్టింగ్ ఎలా ఇస్తారని, సీనియర్లను కాదని జూనియర్ ఇంజినీర్‌కు కీలక పదవి అప్పజెప్పారని స్వయంగా పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. భాస్కర్‌రెడ్డి వ్యవహారం శైలి, లేఖ అంశం తెరమీదకు రావడంతో జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది.
రాయలసీమ ప్రాంతానికి చెందిన భాస్కర్‌రెడ్డి పోస్టింగ్‌లపై మొదటి నుంచీ వివాదాస్పదమే.. మొదటి నుంచి జీహెచ్ఎంసీకి భాస్కర్‌రెడ్డి నియామకంపై గుర్రుగా ఉన్న పలువురు పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు ఏదో రూపంలో తమ అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం పబ్లిక్ హెల్త్లోనే సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా , చీఫ్ ఇంజినీర్‌గా పలు విభాగాల్లో ఉండడం, అది కూడా పలువురి సీనియర్లను పక్కన పెట్టి పోస్టింగ్‌లు ఇవ్వడమే తీవ్ర అసంతృప్తితో లేఖ రాయడానికి పరిస్థితులు దారి తీశాయి. వాస్తవంగా ఆరుగురు తర్వాత జీహెచ్ఎంసీ ఈఎన్సీ, సీఈ బాధ్యతలు అప్పగించాలి.
2019 నాటి ఫైనల్ సీనియర్ల జాబితాలో 14వ స్థానంలో ఉన్న ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎన్ఎన్డీపీ సీఈ కోటేశ్వరరావు, 16వ స్థానంలో ఉన్న మరో సీనియర్ ఇంజినీర్ నర్సింగ్‌రావు, 26వ స్థానంలో ఉన్న ప్రస్తుత మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్, 27వ స్థానంలో ఉన్న ప్రవీణ్ చంద్ర, 29వ స్థానంలో ఉండి కొద్ది నెలల కిందటే రిటైర్ అయిన దత్తుపంత్, 33వ స్థానంలో ఉన్న విశ్వనాథ రాజులను కాదని 38వ స్థానంలో ఉన్న భాస్కర్‌రెడ్డికి కీలక పోస్టులు ఇవ్వడం సరైంది కాదని సంబంధిత లేఖలో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి స్థానంలో వెంటనే రత్నాకర్ సహదేవ్‌కు కానీ నర్సింగ్‌రావులను నియమించాలని ఆ లేఖలో తెలిపారు.
డీఈఈనే నియమించాలనుకున్నా.. ఆయన కంటే మోహన్ కుమార్ సీనియర్‌గా ఉన్నారని గుర్తు చేశారు. ఇక దేవానంద్ రిటైర్ అయిన తర్వాత మోహన్‌కుమార్ అత్యంత సీనియర్ అని ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఆయన మూడు సార్లు ఇన్చార్జిగా కూడా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇక భాస్కర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడంతో మోహన్ కుమార్ స్థానంలో ఆయన ఉన్నారని తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు రాసిన లేఖ జీహెచ్ఎంసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భాస్కర్‌రెడ్డి పోస్టింగ్ దక్కించుకోవడంలోనే కాదు ఆయన పనితీరుపై అనేక ఆరోపణలు లేకపోలేదు. ఎస్ఎన్డీపీ రెండో దశకు సంబంధించి రూ. 600 కోట్లకు ఎస్ఈ హోదాలో టెండర్లను పిలిచారు. ఎస్ఈ హోదాలో అప్పటికే భాస్కర్‌రెడ్డి వద్ద ఐదు పోస్టులు ఉన్నాయి. అందులో సీఈ మెయింటెనెన్స్, సీఈ ప్రాజెక్టు, ఈఎన్సీ జీహెచ్ఎంసీ, సీఈ అడ్మిన్, ఎస్ఈ ఎన్ఎన్డీపీ ఐదు పోస్టులలో హోదాలో ఈ టెండర్లు పిలిచారు. ఇందులో రూ. 450 కోట్ల పనులకు అగ్రిమెంట్ చేశారు. ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియ, అగ్రిమెంట్ తీరులో భాస్కర్‌రెడ్డి పనితీరుపై ఉద్యోగ వర్గాల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి.
హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 2వేల కోట్ల పనులకు ఆయన టెండర్లు పిలిచారు. ఇందులో రూ. 1800కోట్ల మేర పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకోగా, అగ్రిమెంట్‌కు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా సదరు భాస్కర్‌రెడ్డి ఎంఆర్డీసీఎల్ చీఫ్ ఇంజినీర్‌గా నియామకంలో తనదైన శైలిలో చక్రం తిప్పారన్న చర్చ జరుగుతున్నది. సామాజికవర్గం, బిగ్ బ్రదర్‌కు సమీప బంధువునని చెప్పుకొంటూ ఇంజినీరింగ్ విభాగాన్ని భాస్కర్‌రెడ్డి శాసిస్తున్నారని ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా భాస్కర్‌రెడ్డిపై పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అసోసియేషన్ లేఖ నేపథ్యంలో వ్యవహారం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.