Deccan Palm Restaurant |ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్ తార్నాక చౌరస్తాలోని డెక్కన్ పామ్ రెస్టారెంట్లో నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఆమె.. రెస్టారెంట్లో సోదాలు చేశారు. తనిఖీల సందర్భంగా కుళ్లిన, నాణ్యతలేని ఆహారపదార్థాలను రెస్టారెంట్లో గుర్తించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమానిపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంబంధిత ఫుడ్‌సేఫ్టీ అధికారులతో మాట్లాడిన డిప్యూటీ మేయర్. రెస్టారెంట్లో స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలకు పరీక్షలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార నాణ్యత పాటించని అన్ని హోటల్స్, రెస్టారెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా నగర ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తగిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో కీలకమని అభిప్రాయపడ్డారు.