జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అకడ నిబంధనలు నడవవు.. కమిషనర్ ఆదేశాలు చెల్లవు.. కేవలం కొందరి మాటే శాసనం! ముఖ్యంగా ప్రకటనల విభాగంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాగిస్తున్న వ్యవహారం చూస్తుంటే ఉన్నతాధికారులు ఉన్నారా? లేక సదరు ఉద్యోగి వ్యవస్థ నడుస్తున్నదా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకే విభాగంలో ఏడేండ్ల నుంచి తిష్టవేయడమే కాక, మొత్తం విభాగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఐటీ విభాగంలో పని సరిగ్గా చేయలేదని బదిలీ చేసినా, సదరు ఉద్యోగి ప్రకటనల విభాగంలో చేరి తన హవా కొనసాగిస్తున్నారు. సదరు ఉద్యోగి భార్య కూడా అదే విభాగంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో, ఈ దంపతులదే ఇకడ రాజ్యమని తోటి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ); జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఇటీవల చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలు సైతం సదరు ఉద్యోగి దగ్గర ఆగిపోయాయి. కమిషనర్ ఆదేశాల ప్రకారం సదరు ఉద్యోగి ఐటీ వింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అడ్వర్టయిజ్మెంట్ వింగ్, ఐటీ, సెంట్రల్ ట్యాక్స్.. ఇలా మూడు చోట్ల తన పెత్తనం చలాయిస్తుండడం గమనార్హం. ఐటీలో అటెండెన్స్ వేస్తూ, అడ్వర్టయిజ్మెంట్ వింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా బదిలీ అవుతానన్న భయంతో అడ్వర్టయిజ్మెంట్ వింగ్‌లోని కీలక డేటాను పెన్ డ్రైవ్‌ల్లో కాపీ చేసి తన వెంట తీసుకెళ్లినట్లు విమర్శలు లేకపోలేదు.
పబ్లిక్ హెల్త్ వింగ్‌కు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజినీర్ ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. వీరిద్దరూ కలిసి అడ్వర్టయిజ్మెంట్ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మూడో, నాలుగో తరగతికి చెందిన పర్మినెంట్ ఉద్యోగులను ఈ ఔట్ సోర్స్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తుండటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయని, ‘కమిషనరే బదిలీ అవుతారు కానీ, మాకేం కాదు’ అన్న ధీమాతో ఉన్న ఇలాంటి వారిపై ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్, కమిషనర్ కర్ణన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.