సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 100 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బుధవారం బుద్ధభవన్‌లోని సమావేశ మందిరంలో ఏఆర్ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, స్వీప్ నోడల్ అధికారులతో ఓటింగ్ శాతం పెరుగుదల, స్వీప్ కార్యక్రమాల కార్యాచరణపై సమావేశం నిర్వహించారు.
గత ఎన్నికల్లో 50శాతం కన్నా తక్కువ పోలింగ్ జరిగిన పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రానున్న 25 రోజుల పాటు స్వీప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, అందుకు అవసరమైన యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని, రోజువారీగా వివిధ వర్గాల ప్రజలతో పలు రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, సెక్టోరల్ అధికారులు ఇంటింటికి తిరిగి, ప్రతి ఓటరును ఓటు వేసేలా చైతన్య పరచాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీల సహకారంతో ఇంటింటికి తిరిగి ఓటరు కార్డు చూసి, ఓటు ఎక్కడ ఉంది? ఓటరు జాబితాలో పేరు ఉన్నది.. లేనిది చెక్ చేయాలన్నారు. పూర్తి స్థాయిలో ఏఆర్ఓలు పర్యవేక్షించాలని తెలిపారు.
కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, టూరిజం ప్లేసెస్, ప్రార్థన మందిరాలు, బస్ షెల్టర్లు, ప్రధాన కూడళ్లు, ఎగ్జిబిషన్ ఉన్న అన్ని స్థలాల్లో, అన్ని మార్కెట్ యార్డుల్లో, పబ్లిక్ పార్కులు, బస్టాండ్లలో, రెస్టారెంట్లలో ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మే 13న ఓటు వేయాలని వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
విద్యార్థులకు ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగించుకోవడంపై మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ అలివేలు, స్వీప్ నోడల్ అధికారి అరుణకుమారి పాల్గొన్నారు.