సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : స్మార్ట్ వాటర్ నాలా పనులను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం యాకత్‌పుర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌తో కలిసి ఆయన నాలా పనులను పరిశీలించారు. తలాబ్‌కట్ట నాలా పనులు పూర్తి కావడానికి భూసేకరణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం కమిషనర్ రెయిన్ బజార్ నాలా పనులను పరిశీలించి, వాటర్ లాగింగ్ లేకుండా చేయాలన్నారు. యాకుత్‌పురలో రైల్వే ట్రాక్‌కు అనుకొని ఉన్న మురుగు కాల్వ పాత రిటర్నింగ్ వాల్‌ను పునరుద్ధరించాలని చెప్పారు. యాకుత్‌పురలో వెహికల్ అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వీయూపీ వర్షపు నీరు నిల్వ లేకుండా తగిన ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ దత్తు, జోనల్ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్లు మహమ్మద్ వాసి, డాక్టర్ సమీనా, నస్రీన్ సుల్తానా, ముజఫర్, అల్మదార్ వాలజహి శాఫాత్ తదితరులు పాల్గొన్నారు.