సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వచ్చే ప్రజావాణిలోగా దరఖాస్తులను పరిష్కరించి, అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి 67 విన్నపాలు రాగా, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారానికి పంపించారు.
చార్మినార్ జోన్లో 6, సికింద్రాబాద్‌లో 17, కూకట్‌పల్లిలో 58, ఖైరతాబాద్‌లో 4, ఎల్బీనగర్లో 17, శేరిలింగంపల్లిలో 18 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెడ్ ఆఫీస్, జోన్లు కలిసి మొత్తం 187 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజావాణికి ముందు కమిషనర్ రోనాల్డ్ రాస్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా వినతులు స్వీకరించారు. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత్‌రెడ్డి, గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు.