సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, అధికారులతో కలిసి సరూర్‌నగర్ సర్కిల్లోని తపోవన్‌కాలనీ, గ్రీన్ పార్కు కాలనీలలో కమిషనర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. సరూర్‌నగర్ చెరువు అప్ స్ట్రీమ్, ఇన్లెట్లను పరిశీలించారు. నాలా బ్రిడ్జి వద్ద ఇరువైపులా పూడిక తీయాలని అధికారులను ఆదేశించారు.
సరూర్‌నగర్ చెరువు అభివృద్ధి పనులపై లేక్స్ అధికారులతో చర్చించి అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. చెరువు సమీపంలోని కాలనీ గ్రీన్‌పార్కు, తపోవన్ కాలనీ ఎఫ్టీఎల్ సమస్య, సరూర్‌నగర్ సరస్సు, మురుగునీటి సమస్యలను లేకుండా చూడాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లేక్స్ శివకుమార్ నాయుడు, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఎల్బీ నగర్ ఎస్ఈ ఆశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.