సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివిలియన్స్ రిజిస్టేష్రన్ సిస్టం(సీఆర్ఎస్) పరిధిలోకి బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం ద్వారా అవినీతి, అక్రమాలు జరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ జరుగుతున్నదని గుర్తించారు.
ఈ నేపథ్యంలో సీఆర్ఎస్ విధానం ద్వారా అక్రమాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు భావించారు. ప్రస్తుతం ఈ విధానం జీహెచ్ఎంసీ అవతల ఉన్న మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే అమలు చేయాల్సి ఉండగా.. కుల గణన సర్వే, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ ఉండడంతో సమయాన్ని తీసుకున్నారు. ఈ విధానం అమలు కోసం పూర్తిగా అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి తొలుత శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.