GHMC | సిటీబ్యూరో: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 8వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. వివిధ రహదారుల విస్తరణ, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతికి కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది.
కమిటీ సమావేశంలో 15 అంశాలు, ఆరు టేబుల్ అంశాలకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు. ఇందులో ప్రధానంగా హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, రహదారుల విస్తరణకుగానూ 473 చోట్ల ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది.
కాగా కేబీఆర్ పార్కు చుట్టూ భూ సేకరణపై ఆర్డీపీ ప్లాన్ను ఆమోదం తెలిపిన కమిటీ….ఎవరెవరి ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది? ఎన్ని ప్రాపర్టీల సేకరణ చేస్తున్నారు? అనే అంశాలపై స్పష్టత లేకుండానే కమిటీ ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా స్పోర్ట్స్, ఎస్టేట్ విభాగం అధికారుల లోపాలను ఎత్తిచూపుతూ పనితీరులో మార్పు రావాలని మేయర్ అడిషనల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ప్రజల కోసం పని చేయాలని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆయా అభివృద్ధి పనులకుగానూ ప్రతి జోన్కు రూ. 25 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.