
సిటీబ్యూరో, నవంబరు 1(నమస్తే తెలంగాణ): నివా స భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యజమానులకు జీహెచ్ఎంసీ సదవకాశాన్ని కల్పించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (ఎన్ఏసీ) ద్వారా ఎంపికైన ఇంజనీర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో కూడిన బృందాలు ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 118 మార్గాల్లో అన్ని భవనాలను సర్వే చేసి సదరు భవన యజమానులకు కేటగిరి మార్చుకోవాలని సూచించింది.
జీహెచ్ఎంసీ జాబితాలో నివాసంగా అనుమతి పొంది వాణిజ్యానికి మారిన భవన యజమాలను ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం ద్వారా సంస్థకు అదనంగా రూ.200 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావించి ఈ సర్వే చేశారు. కేటగిరి మార్పు జీహెచ్ఎంసీ ఆన్లైన్ వెబ్పోర్టల్లో ఎలా మార్చుకోవాలో తెలిపే వివరాలతో కరపత్రాలు పంపిణీ చేశారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 31వరకు ఆన్లైన్లో కేటగిరి మార్పుతో పాటు సంబంధిత ఫీజు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని అధికారులు సూచించారు.
బృహత్తర ప్రణాళిక నిబంధనల ప్రకారం వాణిజ్య రహదారులపై మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలకు అనుమతి ఉంటుంది. అయితే, సాధారణ రహదారులపై వాటిని ఏర్పాటు చేసుకునే వీలుండదు. ఆయా రహదారులపై భవన వినియోగాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం కూడా పరిమితంగానే ఉంటుంది. క్రమబద్దీకరించుకోవాలంటే జీఓ నం.102లో పేర్కొన్న ఇంపాక్ట్ రుసుమును 1.25 నుంచి 1.5 రేట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై 33 శాతం జరిమానా విధిస్తారు.
మరో కేటగిరిలో హాస్పిటల్స్, నర్సింగ్ హోంలు, విద్యా సంస్థలు,ప్రజా ఉపయోగ షాపులకు (500 గజాలలోపు ఉన్న భవనాల్లో) నివాస భవనాలు, వ్యాపార కార్యకలాపాలు ఉండే భవనాలకు ఇంపాక్ట్ ఫీ ఇలా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు రెండు శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. అపై నిర్మిం చే అంతస్థులకు 1 శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ.50ల చొప్పున ఇంపాక్ట్ ఫీని వసూలు చేస్తారు. వచ్చే ఏడాది మార్చి 31లో ఇంపాక్ట్ ఫీ 100శాతం చెల్లించిన వారికి 10 శాతం రాయితీ అని, ఈ సదవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.