
సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): సకాలంలో ఆస్తిపన్ను చెల్లించని నగరవాసులు ఇక ప్రతి నెల రెండు శాతం పెనాల్టీ చెల్లించాల్సిందేనని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు పన్ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అయితే మొదటి ఆరు నెలల్లో మొదటి మూడు నెలలు.. మిగిలిన ఆరు నెలల్లో మూడు నెలలు పెనాల్టి చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఓ వేళ సంవత్సరం పాటు ఆస్తి పన్ను చెల్లించకుంటే 24 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కమర్షియల్ రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలను సర్వే చేసేందుకు 340 బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఇంటింటికి వెళ్లి మిక్సింగ్, కమర్షియల్ అనుమతి లేకుండా పై అంతస్తు భవనాలు ఉన్న పక్షంలో మార్చుకునేందుకు స్వయంగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా 49,439 మంది స్వయంగా ట్యాక్స్ మదింపు చేయాలని కోరగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా మదింపు కానీ, తకువ అసెస్మెంట్ ఉన్న నిర్మాణాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ట్యాక్స్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతున్నదని అధికారులు వివరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 17,34,411 కమర్షియల్, రెసిడెన్షియల్, మిక్సిడ్ భవనాలు కలిగిన పన్ను చెల్లింపుదార్లు ఉన్నారు.
ఇందులో 9, 06, 486 ప్రాపర్టీలకు ఇప్పటి వరకు సుమారు రూ.887కోట్ల అస్తి పన్ను చెల్లించారు.
మిగిలిన వారు కూడా వెంటనే చెల్లించి 2 శాతం పెనాల్టీ నుంచి మినహాయింపు పొందాలని అధికారులు సూచించారు.