
సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ): నగరంలో రోజూ విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా పనులు ఊపందుకున్నాయి. కొత్తగా 14 మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. 3,866 కోట్ల అంచనా వ్యయంతో 31 చోట్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కూకట్పల్లి నాలా పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే 17 ఎస్టీపీల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించిన అధికారులు, తాజాగా మరో 14 చోట్ల ఎస్టీపీల టెండర్లను పిలిచారు. నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి కానున్నాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు 195 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 25 ఎస్టీపీల ద్వారా 77.2 కోట్ల మురుగు నీరు మాత్రమే శుద్ధి అవుతున్నది. మిగిలిన నీటిని కూడా ప్రతిరోజూ శుద్ధి చేసేందుకు వీలుగా 125 కోట్ల సామర్థ్యం ఉన్న 31 ఎస్టీపీలను జలమండలి నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో మురుగు జలాలను 100 శాతం శుద్ధి చేసి సమీపంలో ఉన్న చెరువుల్లో, మూసీ నదిలో కలుపుతారు.