
ఇటీవల గాజులరామారంలో పనులు ప్రారంభించిన సీఎస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్ఫూర్తిగా పనులు చేపట్టాలని ఆదేశాలు పూలు, పండ్లు, తీగజాతి మొక్కలకు ప్రాధాన్యం వందశాతం గ్రీనరీ కాలనీలకు ప్రత్యేకాధికారులు శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పచ్చదనం పెంపునకు జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తున్నది. ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు బల్దియా 6 జోన్ల పరిధిలో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల గాజులరామారంలో సీఎస్ గ్రీనరీ పనులు ప్రారంభించగా, స్వల్ప వ్యవధిలోనే 16 కాలనీల్లో వందశాతం మొక్కలు నాటి స్ఫూర్తిగా నిలిచారు.
కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన టీకాలు వేసిన తరహాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ చివరికల్లా గ్రేటర్‌వ్యాప్తంగా 4846 కాలనీల్లో వందశాతం గ్రీనరీ పనులు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. సంపూర్ణంగా మొక్కలు నాటిన కాలనీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరి పర్యవేక్షణలో షిఫ్టుల వారీగా పదిమంది కార్మికుల నియామకం, ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్‌ను సమకూర్చుతున్నారు. కాలనీ ప్రవేశద్వారం మొదలు చివరివరకు పచ్చదనం ఉట్టిపడేలా పండ్లు, పూల మొక్కలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లోని పలు కాలనీలు ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నిండైన పచ్చదనంతో ముస్తాబవుతూ స్థానికులను మైమరిపిస్తున్నాయి. వందశాతం గ్రీనరీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ 16 కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. తొలివిడుతలో ఆ కాలనీల్లో 100 శాతం మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేసింది. వందశాతం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్ఫూర్తిగా తీసుకొని 4846 కాలనీల్లో 100 శాతం గ్రీనరీని పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఆయా జోనల్ కమిషనర్ల సారథ్యంలో కాలనీలలో ఖాళీ స్థలం కనిపించకుండా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగానే 16 కాలనీల్లో పనులు విజయవంతంగా పూర్తి చేశామని, మిగిలిన కాలనీల్లో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని.. వచ్చే నెలాఖరు కల్లా అన్ని కాలనీల్లో పచ్చదనం పనులు పూర్తి అవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు వివరిస్తున్నారు. ఇక వందశాతం మొక్కలు నాటిన కాలనీల్లో వాటి నిర్వహణ కోసం కాలనీల వారీగా ప్రత్యేక ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించామని.. ఈ అధికారుల పర్యవేక్షణలో పదిమంది కార్మికులు పని చేస్తారని.. వీరంతా ప్రతి సీజన్లో కాలనీలన్నీ పచ్చని హారం తొడుక్కునేలా చర్యలు చేపడుతారన్నారు.
కాలనీల్లో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే పండ్లు, పూల మొక్కలను అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాలనీల్లో రహదారుల వెంట, పార్కులు, చెరువు గట్లు, శ్మశాన వాటికల్లో ఆహ్లాదం పంచే మొక్కలు నాటుతున్నారు. కొంచెం స్థలం ఎక్కువగా ఉన్న చోట ఒక వరుసలో పూల మొక్కలు, రెండో వరుసలో ఒక ఫీట్ వరకు పెరిగే పొగడ, జిజ్జోనియా మెగాఫోటమికా, చివరి వరుసలో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి మొక్కలను నాటుతున్నారు.