
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యంగా రూ.29,695 కోట్ల భారీ అంచనాలతో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) మొదటి విడత పనులు తుది అంకానికి చేరాయి. 80శాతానికి పైగా ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో నగరం ఫ్రీ సిగ్నల్ సిటీగా మారింది. అప్పటి వరకు ట్రాఫిక్ జంఝాటంగా మారిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బాలానగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శం షాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు ఎస్ఆర్డీపీతో చెక్ పెట్టారు. స్కైవేలు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీలతో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపర్చారు. ఇందులో భాగంగానే పథకం మొదటి దశ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో రెండో దశ వైపు అడుగులు వేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండో దశ పనులపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్, నాగోల్, ఆరాంఘర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రెండో దశ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఉప్పల్ వైపు వాహనాల రద్ది పెరుగుతుండటం, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభంతో మరింత రద్ది పెరిగే అవకాశం ఉంది. వరంగల్ హైవేలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటంతో అతిపెద్ద ఫ్లై ఓవర్ ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మించాలని నిర్ణయించారు.
ఈ మేరకు హబ్సీగూడ నుంచి నాగోల్ వరకు ఉన్న ముఖ్య కూడళ్ల వద్ద పై వంతెనలు నిర్మించనున్నారు. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెడుతూ జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, మేడ్చల్ హైవే సుచిత్ర కూడలి వద్ద పై వంతెనలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్డీపీ పనుల కోసం నిధులను జీహెచ్ఎంసీ బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్నారు. సర్కారు అనుమతికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఒవైసీ దవాఖాన జంక్షన్ ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ అండర్‌పాస్, బైరామల్‌గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లై ఓవర్, బహదూర్‌పురా జంక్షన్ ఫ్లై ఓవర్, తుకారాంగేట్ ఆర్యూబీ, షేక్‌పేట ఎలివేటెడ్ కారిడార్, కొత్తగూడగ్రేడ్ సఫరేటర్ , ఆర్వోబీ కైత్లాపూర్, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, చాంద్రాయణగుట్ట గ్రేడ్ సఫరేటర్ అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ఇతర ప్రాంతాల్లో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు వచ్చే ఏడాది జూన్ చివరి నాటికల్లా అందుబాటులోకి తీసుకువచ్చి మొదటి దశను పూర్తి చేయాలని నిర్ణయించారు.