DCA | సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నకిలీ మందులు తయారు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని డీసీఏ అధికారులు పోలీసుల సహకారంతో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. నకిలీ ఔషధాలు తయారు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పి.లక్ష్మీనర్సయ్యపై రాష్ట్రంలోని పలు చోట్ల నాన్ బెయిలెబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నకిలీ మందుల తయారీ కేసుల్లో సదరు నిందితుడు మోస్ట్ వాంటెండ్ లిస్టులో ఉన్నాడు. గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న లక్ష్మీనర్సయ్యను నిజామాబాద్ డీసీఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాచిగూడలోని ఒక లాడ్జిలో అరెస్టు చేశారు. అనంతరం కామారెడ్డిలోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు.
గత కొన్ని సంవత్సరాలుగా నిందితుడు నకిలీ మందులు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. దీనిపై దృష్టిపెట్టిన డీసీఏ అధికారులు లక్ష్మీనర్సయ్యపై కేసులు నమోదు చేశారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క నిజామాబాద్‌లోనే 9 కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఆర్మూర్‌లో 3, నల్గొండలో 2, కామారెడ్డిలో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నాయి. డీసీఏ అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని.. ఏపీలోని ప్రొద్దుటూరు నుంచి ట్రాక్ చేస్తూ కాచిగూడలోని ఓ లాడ్జిలో ఉన్నాడని గుర్తించి అరెస్టు చేశారు.