Sabitha Indra Reddy | బడంగ్‌పేట : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలంలోని నాగారంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గతేడాది నుంచి కేంద్రం, రాష్ట్రాల నుంచి గ్రామాలకు ఒక్కపైసా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏం పనులు చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థలలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని.. అలాంటి పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో తెలియడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే అన్నారు. ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, పాండు, కరోళ్ల చంద్రయ్య, అంబయ్య, బాలయ్య, లింగం, మోతిలాల్, వీరా నాయక్, రవీందర్, చల్మారెడ్డి, రామ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదిల్ తదితరులు ఉన్నారు.