HCU | కొండాపూర్, మార్చి 18 : అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, ఇండో – జర్మన్ అకాడమిక్ భాగస్వామ్యాలను పెంపొందించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కృషి చేస్తుందని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు.
మంగళవారం జర్మనీ దేశానికి చెందిన వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధుల బృందం హెచ్‌సీయూను సందర్శించింది. విచ్చేసిన 21 మంది సభ్యుల బృందాన్ని వైస్ ఛాన్సలర్ బిజే రావు సాదరంగా ఆహ్వానిస్తూ, వర్సిటీ విశిష్ఠతను వివరించారు. ఇండో – జర్మన్ అకాడమీ భాగస్వామ్యంతో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, మెరుగైన పరిశోధనలు, అధ్యాపక, విద్యార్థుల ఎక్సేంజ్ ప్రోగ్రాంలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ భాగస్వామ్యంతో జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ కరికులంలో డ్యూయల్ డిగ్రీలు, స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ద్వారా డిగ్రీలు పొందే అవకాశం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఏఏడి ఇండియా డైరెక్టర్ డాక్టర్ కట్జ లాచ్, జనరల్ సెక్రెటరీ డాక్టర్ కై సిక్స్, వర్సిటీ ఆఫీసర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బ్రహ్మానందం మనవతి, జర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు.