సిటీబ్యూరో, అక్టోబరు 23 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పన్వర్‌హాల్‌లో గురువారం ట్రైనింగ్ అవగాహన కోసం ఉద్దేశించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల అనుసంధాన ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్‌లాల్ పరిశీలించారు. ట్రైనింగ్ పర్సన్స్ పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఉప ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే అనుసంధానం ఎలా చేస్తారు అంటూ ట్రైనింగ్ పర్సన్స్‌ను పరిశీలకులు ప్రశ్నించారు. సిరీస్ విధానంలో అనుసంధానం చేస్తామని ట్రైనర్లు తెలిపారు. అభ్యర్థులు ఎక్కువ బరిలో నిలిచే అవకాశం ఉన్నందున బీయు, సీయూ, వీవీ ప్యాట్ల అనుసంధానం జాగ్రత్తగా చేపట్టేలా శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ట్రైనర్లకు రంజిత్‌కుమార్ సింగ్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ కర్ణన్ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఈ (ఎలక్షన్) మురళి పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వినియోగించబోయే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)కు గురువారం చాదరఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలకు మొదటి దశ పరీక్షలు నిర్వహించారు.