సిటీబ్యూరో,ఆగస్టు25(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన్ పేర్కొన్నారు. శుక్రవారం గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్థుల అత్యుత్తమ ఆవిష్కరణలతో నిర్వహించిన గీతం స్మార్ట్ ఇండియా థాన్-2023 మూడో విడుత పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. స్టార్టప్ ఇండియా.. నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్, బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలు స్టార్టప్‌లను అంతగా విశ్వసించేవారు కాదని.. కానీ వాటితో వస్తున్న సత్ఫలితాలతో సానుకూలత పెరిగిందన్నారు.స్కైరూట్ అంచెలంచెలుగా ఎదిగి నేడు ఏడంతస్తుల ఎత్తగల రాకెట్ నిర్మాణంతో పాటు బహుళ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగల సామర్థ్ధ్యాన్ని సాధించిందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి సభ్యాక్షత వహించిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ స్కైరూట్ ఆరేండ్లలో రూ.500 కోట్ల నిధులను సమీకరించిందని.. ఇంత పెద్ద మొత్తంలో మరే స్టార్టప్ నిధుల సమీకరణ చేయలేదన్నారు. గీతమ్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడిసి) నిర్వహిస్తున్న వ్యవస్థాపకుడి పరిచయ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని వర్ధమాన ఇంజినీర్లకు సూచించారు. స్టార్టప్ ఇండియా సీనియర్ మేనేజర్ డాక్టర్ సురభి గుప్తా సంస్థ అందిస్తున్న సేవలను.. గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కార్యక్రమ ఇతివృత్తాన్ని.. వీడీసీ డైరెక్టర్ శ్రీదేవి దేవిరెడ్డి కార్యక్రమ లక్ష్యాలను వివరించారు.
అమెరికాలోని బోస్టన్ నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్రెగ్ కొలియర్, ప్రొఫెసర్ రవి రామమూర్తి, స్టార్ట్ ఇండియా థాన్-2023 ఫలితాలను వెల్లడించి విజేతలను సత్కరించారు. న్యూన్ అప్టెక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు స్టార్ట్ ఇండియా థాన్ విజేతలుగా నిలిచి రూ.2లక్షల నగదు పురస్కారాన్ని, పాలిఫ్యూయలర్ వ్యవస్థాపకులు ద్వితీయ బహుమతిగా రూ.1 లక్ష, ఆగ్రోడ్రాయిడ్ సమాజంపై ప్రభావం చూపే ఆలోచన అంశంలో తృతీయ బహుమతిగా రూ.50 వేలు, ఉత్తమ మహిళా వ్యవస్థాపకులుగా కోయాక్ట్ బృందం రూ.50 వేలు, లెబెన్ జాన్సన్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును మెడీక్యాండీ గెలుచుకుని రూ.50 వేల పురస్కారాలను దక్కించుకున్నారు. ఆయా విజేతలకు గీతం ఖర్చులతో 2 వారాలపాటు బోస్టన్‌లో నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాలకు పంపించనున్నట్లు ప్రకటించారు.