Ameerpet | అమీర్‌పేట, మార్చి 8 : వర్షం వస్తుందంటే చాలు.. అమీర్‌పేట్ గాయత్రీ నగర్ కాలనీ నివాసితులకు కంటిమీద కునుకు మాయం అవుతుంది. ఇందుకు కారణం చాలా కాలం క్రితం, ఈ కాలనీలోని రెండు ఇళ్ల మధ్య నుండి వెళ్తున్న వరదనీటి కాలువ(8 ఫీట్ల వెడల్పు)ను ఓ వ్యక్తి పూర్తిగా ఆక్రమించుకొని, తన స్థలంలో కలుపుకొని, ప్రహరీ నిర్మించుకున్నారు. ఆ వెంటనే నాలాను డమ్మీ చేసి ఆ స్థలంలో తాను నిర్వహిస్తున్న హాస్టల్‌కు క్యాంటీన్ నిర్మించుకున్నాడు. దీంతో వరద నీరు పారేందుకు వేరే మార్గం లేక, పైప్రాంతల నుండి వచ్చే వరద నీరు కాలనీలోని రోడ్లను, ఇళ్లను ముంచేత్తే పరిస్థితులు ఉండేవి. అయితే నాలా ఆక్రమణ విషయాలను గాయత్రీ నగర్‌కు చెందిన బిఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషు కుమారితో కలిసి అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన అప్పటి మంత్రి తలసాని పలుమార్లు ఈ ప్రాంతంలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన సందర్భాల్లో సమస్యను పరిశీలించారు. కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్న అప్పటి మంత్రి తలసాని సమస్య పరిష్కారానికి నడుం బిగించారు.
ఈ సమస్యను అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రేటర్ పరిధిలో చేపడుతున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఎస్ఎన్డీపీ) లో భాగంగా ఈ నాలా ఆక్రమణ తొలగింపు పనులు చేపట్టే విధంగా అప్పట్లో తలసాని విశేష కృషి చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ సహా గ్రేటర్ కమిషనర్, జలమండలి ఎండి, జిల్లా కలెక్టర్, హెచ్ఎండిఏ కమిషనర్లు గాయత్రీ నగర్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి నాలా ఆక్రమణలను పరిశీలించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నాలాల ఆక్రమణల తొలగింపుకు పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయడంతో పనులకు లైన్ క్లియర్ అయింది.
అయితే మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారడంతో నాలా ఆక్రమణల తొలగింపు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికారం లేకపోయినా బిఆర్ఎస్ నాయకులు ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. గాయత్రీ నగర్ కు చెందిన వినోద్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి నాలా ఆక్రమణ సమస్యలపై తమ పోరాటాన్ని ముమ్మరం చేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి కూడా వత్తిడి అధికం కావడంతో ఎట్టకేలకు ఇక్కడి నాలా ఆక్రమణల తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. ఎమ్మెల్యే తలసాని ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, గాయత్రీ నగర్ బిఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్ తో కలిసి ఇక్కడ జరుగుతున్న నాలా ఆక్రమణల తొలగింపు పనులను శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాయత్రీ నగర్ నాలా ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషితోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అమీర్‌పేట్ డివిజన్ అధ్యక్షులు ఎం హనుమంతరావు నాయకులు అశోక్ యాదవ్ కూతురు నరసింహ కట్ట బలరాం తదితరులు పాల్గొన్నారు.