మణికొండ, మే 7: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అన్నిశాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. గేటెడ్ కమ్యూనిటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోకాపేటలోని లెజెండ్ చైమ్స్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీ నివాసితులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్ బాబు, నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిటీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీల్లో దోమల స్వైరవిహారంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని, గత కొన్నిరోజులుగా చికున్‌గున్యా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు కమ్యూనిటీవాసులు వివరించారు. గండిపేట ప్రధాన రహదారి మరింత విస్తరించి ట్రాఫిక్ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గేటెడ్ కమ్యూనిటీల సమీపంలో నుంచి వెళ్లే నాలాల్లో ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి నిల్వ ఉండటంతో అక్కడ దోమలు పెరిగి కమ్యూనిటీలకు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి అధికారులకు తెలిపారు. దోమల నివారణకు నాలాలపై రిటర్నింగ్ వాల్ నిర్మించి, దిగువన నాలాను శుభ్రం చేస్తే మురుగు కిందకు వెళ్లే అవకాశం ఉంటుందని సూచించారు.
అదేవిధంగా ప్రధాన రహదారిలో కూడా ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుందని, కొన్నిచోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. గతంలో కోకాపేట నుంచి గండిపేట చౌరస్తా వరకు ఎలాంటి డీపీఆర్ లేకుండా రహదారి నిర్మించడంతో భారీగా వర్షాలు కురిసినప్పుడు మగధ విలేజ్, లుంబినీ బ్రూక్, రాజపుష్పా ఆట్రీయా లాంటి గేటెడ్ కమ్యూనిటీల్లోకి నీరువచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్ బాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. దోమల నివారణ కోసం తక్షణ చర్యలు చేపడుతామని నార్సింగి మున్సిపల్ కమీషనర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. గండిపేట మండల పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని మున్సిపల్ కమీషనర్ కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.