మేడ్చల్, ఆగస్టు 4 : మేడ్చల్ పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కూలిపోయి, మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఎగిరి పడిన భవన శకలాలు తగిలి, రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయపడి మృతి చెందగా, ఇంట్లో ఉన్న వృద్ధురాలు, మొబైల్ దుకాణం నిర్వాహకుడికి గాయా లయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డు కూడలికి సమీపంలో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం…మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ కూడలికి సమీపంలో జాతీయ రహదారి-మార్కెట్ రోడ్డు పక్కన పట్టణానికి చెందిన శ్రీరాములు గౌడ్‌కు భవనం ఉంది.
పాతకాలం నాటి భవనంలో రోడ్డు వైపుకు రెండు పూల దుకాణాలు, ఒక మొబైల్ దుకాణం ఉంది. ఆ వెనకాల ఉన్న నివాస గృహంలో శ్రీరాములు గౌడ్ చెల్లెలు తిరుపతమ్మ(55) నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఆ శబ్ధానికి ఆ భవనంలో ఉన్న మూడు దుకాణాలు ధ్వంసం కావడంతో భవన శిఖరాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎగిరి పడ్డాయి. అదే సమయంలో రోడ్డు మీద నడుచుకుంటున్న వెళ్తున్న గుర్తు తెలియని(40) వ్యక్తికి భవన శకలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని వెంటనే చికిత్స నిమిత్తం తరలిస్తుండగానే మృతి చెందాడు. కాగా భవన శకలాల్లో కూరుకుపోయిన తిరుపతమ్మకు ఒళ్లు కాలిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు భవనం పక్కన ఉన్న స్టేషనరీ దుకాణంలో పని చేసే రఫిక్(23) కూలిపోయిన గోడ శకలాలు చేయి పడటంతో చేయి విరిగిపోయింది. అలాగే మొబైల్ దుకాణంలో పని చేసే దినేశ్(25)కు గాయాలయ్యాయి. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదాల వివరాలపై ఆరా తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.