బండ్లగూడ, మార్చి 6: బండ్లగూడ జాగిర్ (Bandlaguda Jagir) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో నాడు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక ర్యాంకులు సాధించిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్.. నేడు నిర్వహణ లోపంతో కునారిల్లుతున్నది. ప్రజలలో అవగాహన కొరవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ల పైన చెత్త దర్శనమిస్తున్నది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారంతో చెత్తాచెదారం రోడ్లపైకి వచ్చి చేరుతున్నడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పారేసిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతుండటంతో ముక్కు మూసుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి.
ఐదు నెలలుగా లేని శానిటేషన్ ఇన్స్పెక్టర్..
బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సానిటేషన్ మేనేజర్‌గా పనిచేసిన నరేష్ బదిలీపై వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పటివరకు శానిటేషన్ ఇన్స్పెక్టర్గా ఎవరు కూడా రాకపోవడంతో పారిశుద్ధాన్ని గాలికి వదిలేసారు. దీంతో పలు ప్రాంతాలను చెత్తను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాలలో రోడ్లపై చెత్త చెదారం తీవ్రస్థాయిలో పేరుకుపోయి కంపు కొడుతుంది.
నాడు స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకులు..
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి స్వచ్ఛ సర్వేక్షన్లో పారిశుద్ధ నిర్వహణ పై అనేక ర్యాంకులు సాధించింది. ఇప్పటికైనా అధికారులు మేలుకొని పారిశుధ్యం పై దృష్టి కేంద్రీకరించకపోతే ఈసారి ర్యాంకులు కష్టమే.