కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 4: గుట్టుచప్పుడు కాకుండా స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాటున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఒకటి బుధవారం పోలీసులకు చిక్కింది. ఒడిశా నుంచి శామీర్‌పేటలోని ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి వాహనాన్ని పోలీసులు పట్టుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మంగళవారం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ టీంతో పాటు శామీర్‌పేట పోలీసులు కలిసి శామీర్‌పేటలోని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్న స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాహనాన్ని ఆపి, తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి బయటపడింది. వాహనంతో పాటు సరుకును, నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో హర్యానా ప్రాంతానికి చెందిన భజరంగ్ (23), రాజస్థాన్‌కు చెందిన గజేందర్ సింగ్ అలియాస్ గుజ్జు(26), హర్యానాకు చెందిన నరేశ్ చింగ్లా(40), కపిల్ శర్మ(28) కలిసి ఒక ముఠా ఏర్పాడ్డారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు అడ్డదారుల్లో గంజాయి సరఫరా చేస్తున్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన భజరంగ్ కొన్నేండ్ల కిందట నగరంలోని బోయిన్‌పల్లిలో ఉన్నాడు. భజరంగ్ డ్రగ్ వ్యాపారి బలరాం వద్ద పని చేశాడు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన బలరాం జైలుకు వెళ్లడంతో.. భజరంగ్ అతడి వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఒడిశాకు చెందిన శామ్యూయల్ అలియాస్ సుభాష్ ద్వారా అతడు గంజాయి కొనుగోలు చేసి.. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తున్నాడు. అతడి నుంచి సరుకు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా గూడ్స్ వాహనాల ద్వారా ఇతర సామగ్రితో కలిపి గంజాయి రవాణా చేస్తున్నాడు.
ఒప్పందం మేరకు గంజాయిని మహారాష్ట్రలో ఉన్న రాకేశ్ అనే వ్యక్తికి పంపించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి ఓ వాహనంతో పాటు సుమారు రూ.95.75 లక్షల విలువజేసే 243 కిలోల ఎండు గంజాయి, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్, అదనపు డీసీపీ పి.శోభన్‌కుమార్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు, బాలానగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, శామీర్‌పేట ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.