సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఒడిశా టూ ఢిల్లీ వయా హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాను మహేశ్వరం ఎస్ఓటీ జోన్, చౌటుప్పల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు కథనం ప్రకారం.. యూపీ, గజియాబాద్‌కు చెందిన మహహ్మద్ రైయీస్అఫ్రీది రిక్షా పుల్లర్‌గా పనిచేస్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన మథిలేష్ సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఒకరికొకరు ఢిల్లీలో పరిచయం అయ్యారు. ఢిల్లీలో వీళ్లిద్దరికి ఒక డ్రగ్ స్మగ్లర్ పరిచయం అయ్యా డు. ఏపీ రాజమండ్రిలో గంజాయి తీసుకొని, న్యూఢిల్లీకి రావాలని గంజాయి తెచ్చినందుకు భారీగా డబ్బులు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు.
ఇందులో భాగంగా గత నెల 6వ తేదీన ఇద్దరికి ఒక కారు ఇచ్చి రాజమండ్రి పంపించాడు. అక్కడి నుంచి ఒడిశాలోని మ ల్కాన్గిరి ప్రాంతానికి తీసికెళ్లి, గంజాయి ప్యాక్ చేసి కారును ఇద్దరికి అప్పగించాడు. దీం తో ఈ ఇద్దరు గంజాయితో ఢిల్లీకి వెళ్లి ప్రధాన డ్రగ్ స్మగ్లర్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే మరోసారి గంజాయి తెచ్చేందుకు ఢిల్లీ డ్రగ్ పెడ్లర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరు ట్రైన్లో రాజమండ్రి చేరుకొని అక్కడ డ్రగ్ విక్రయించే వ్యక్తులను కలిశారు. అక్కడ 90కిలోల గంజాయితో ఉన్న కారును ఈ నెల 22న ఇద్దరికి అప్పగించడంతో నంబర్ ప్లేట్ మార్చుకొని ఢిల్లీకి బయలుదేరారు. కాగా చౌటుప్పల్‌లోని పంతంగి టోల్గేట్ వద్దకు రాగానే మహేశ్వర్ ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు కారును ఆపి తనిఖీలు చేయగా అందులో 90 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు అఫ్రిదీ, మథిలేష్లను అరెస్ట్ చేసి, గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.