Hyderabad | మారేడ్పల్లి, సెప్టెంబర్ 8 : గోపాలపురం పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. అకారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తితో పాటు టీ స్టాల్ నిర్వాహాకుడితో పాటు మరో వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన సోమవారం గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… రెజిమెంటల్ బజార్ ప్రాంతానిక చెందిన సాయి అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి గంజాయి సేవించాడు. ఈ నలుగురు దారి వెంట వెళ్తున్న ఓ యువకుడిని పిలిచి అకారణంగా అతడితో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. దెబ్బలకు తట్టుకోలేక ఆ యువకుడు చెప్పులను సైతం అక్కడే వదిలిపెట్టి కేకలు వేస్తూ అక్కడ్నుంచి పారిపోయాడు. ఇదే బ్యాచ్ స్థానికంగా ఉన్న గండిమైసమ్మ ఆలయం పక్కనే ఉన్న టీ స్టాల్ వద్దకు వచ్చి టీ స్టాల్ నిర్వాకుడితో గొడవకు దిగడంతో మరో యువకుడు అడ్డురావడంతో ఇద్దరిపై దాడి చేశారు. చాయ్ తయారు చేసే పాత్రలతో దాడి చేయడంతో పాటు నిర్వాహాకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికంగా పదుల సంఖ్యలో జనం ఉన్నప్పటికి ఎలాంటి భయం లేకుండా వారు విచ్చలవిడిగా దాడులకు తెగబాడ్డారు. ఇదే సమయంలో గండి మైసమ్మ ఆలయ నిర్వాహాకుడు నీలాంకర్ స్థానికులతో కలిసి దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇటీవల జైలు నుంచి విడులైన నిందితుడు..
ఇటీవల జైలు నుంచి విడులైన సాయి తన బుద్ది మాత్రం మార్చుకోలేదు. గోపాలపురం పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో ఈ గంజాయి బ్యాచ్ ఉదయం 6 గంటలకు అడ్డాను ఏర్పాటు చేసుకొని అక్కడే గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి తీసుకొని సేవించి… రోడ్డుపై వెళ్తున్న వారిపై అకారణంగా వాగ్వదానికి దిగి దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు. స్థానికంగా నిత్యం బస్తీలు, గల్లీలను తమ డ్డాలుగా మర్చుకొని అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ గస్తీ పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.