Hyderabad | సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోకి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చొరబడ్డాయి. శివారుల్లోని కాలనీల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నాయి. ఒకపక్క దొంగతనాలు.. మరోపక్క దోపిడీలు, స్నాచింగ్‌లు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ వైపు చూడాలంటే భయపడేవి. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈజీగా నగరంలోకి వచ్చేస్తూ.. సునాయసంగా దొంగతనాలు, దోపిడీలు చేసుకొని పారిపోతున్నారు. ఆ ముఠాల ఆచూకీ కూడా పోలీసులు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. శివారుల్లో గతంలో ‘ధార్’ చడ్డీ గ్యాంగ్‌లు, సిటీలో ‘చుడీదార్’ గ్యాంగులు హల్చల్ చేశాయి.
ఇటీవల నల్గొండ పోలీసులు పార్ధీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. ఇవన్నీ ఇతర రాష్ర్టాల ముఠాలే. తాజాగా, నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు విల్లాల్లో చోరీ జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో భద్రత, వసతులు బాగుంటాయనే ఉద్దేశంతోనే ధర ఎక్కువైనా విల్లాలు, ఫ్లాట్లు చాలా మంది కొనుగోలు చేస్తారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల భద్రత అయోమయంగా మారింది. గేటెడ్ కమ్యూనిటీలు తమ సొంత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, వాళ్లకు భద్రత పరంగా ఎలాంటి అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల దొంగలు సునాయసంగా గేటెడ్ కమ్యూనిటీల్లోకి చొరబడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి.. మన భద్రతకు ఢోకా లేదన్నట్లుగా వ్యవహరిస్తూ డొల్లగా ఉండే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటుంటారు. దీంతో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు. దొంగతనం జరిగిన తరువాత సీసీ కెమెరాలను చూస్తున్నారు. విషయం పోలీసులకు చేరేలోపే దొంగలు సరిహద్దులు దాటుతున్నారు.
గతంలో హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దొంగతనాన్ని ధార్ గ్యాంగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, శివారులో చెడ్డీ గ్యాంగ్ కూడా హల్చల్ చేసింది. నగర నడిబొడ్డున చుడీదార్ గ్యాంగ్ కూడా చోరీలు చేసింది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడ్డ కొత్త గ్యాంగ్.. భారీగా దొంగతనానికి పాల్పడింది. తాజాగా.. జరిగిన దొంగతనం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ గ్యాంగ్ వివరాలు తెలుసుకుంటున్నామని, అంతర్రాష్ట్ర ముఠాగానే భావిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినా.. ప్రయోజనం లేదు.
గత ప్రభుత్వ హయాంలో ఏదైనా దొంగతనం జరిగిందంటే 24 గంటల్లోనే నిందితులను గుర్తించి.. 48 గంటల్లోపు ఆ నిందితులను పట్టుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కనీసం దొంగతనం ఎవరు చేశారనే విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించి.. నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల నెట్వర్క్ సహాయంతో నిందితులకు సంబంధించిన ఆధారాలను సేకరించి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితులను పట్టుకునేవారు. ఇలా సమాంతరంగా పనిచేస్తూ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు ముచ్చెమటలు పట్టించారు.
నేడు అదే పోలీసులు నిద్రావస్థలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులతోనే అంతర్రాష్ట్ర ముఠాలు తిరిగి యాక్టివేట్ అవుతూ.. హైదరాబాద్ వైపు చూస్తున్నాయనే చర్చ సైతం జరుగుతోంది. నేరాలు జరగకుండా కట్టడి చేయడం, జరిగినా 24 గంటల్లోనే ఆ నేరస్తులను పట్టుకోవాలనే లక్ష్యంతో గతంలో పనిచేశారు. ప్రజల్లో భద్రతపై భరోసా కల్పించారు. నేడు పోలీసులు అదే తీరుగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రజలు కోరుతున్నారు.