Hyderabad | సిటీబ్యూరో:దొంగల ముఠాల మధ్య ఏర్పడ్డ అధిపత్య పోరు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో దొంగల ముఠా నాయకుడైన మాజీ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్‌ను తన ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా నలుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 బ్యాచ్‌కు చెందిన మేకల ఈశ్వర్ దొంగలతో చేతులు కలిపి, ముఠాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలు చేయించాడు. 2022లో నల్గొండ పోలీసులు దొంగల ముఠాను విచారిస్తున్న క్రమంలో ఈశ్వర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
ఈ క్రమంలోనే ఈశ్వర్ తన పాత మిత్రుడైన శంకర్‌ను భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఇద్దరు కలిసి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను నిర్వహిస్తూ నేర సామ్రాజాన్ని విస్తరించారు. ఈ క్రమంలో ఇతర ముఠాలతో విబేధాలు ఏర్పడ్డాయి. ఈశ్వర్‌కు, తన భాగస్వామి మధ్య సైతం ఆధిపత్య పోరు, ఆర్థిక పరమైన విభేదాలు వచ్చాయి. ఈ విషయం నగరంలో ఉన్న ఇతర దొంగల ముఠాలకు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుకుందామంటూ పిలిపించి మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ చౌరస్తాలోని ఒక బార్లో సిట్టింగ్ పెట్టారు. ఆ తర్వాత బార్ నుంచి బయటకు వచ్చిన ఈశ్వర్‌ను తన ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. చికిత్స పొందుతూ గత శనివారం ఈశ్వర్ మృతి చెందాడు.
నలుగురు నిందితుల అరెస్టు
ఈశ్వర్ తన భాగస్వామితో పాటు మరికొందరు దొంగల ముఠాల నాయకులు తమిళనాడు, కర్ణాటక, ఏపీతో పాటు తెలంగాణలో నుంచి తమ గ్యాంగ్‌లోకి సభ్యులను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా నెల రోజులకు ఒక్కో దొంగల జంటకు(ఇద్దరు యువకులు) లక్ష రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. ఈశ్వర్, శంకర్ సుమారు 30 వరకు టీంలను అంతర్రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈశ్వర్‌ను హత్య చేసిన ఘటనలో సోమవారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి వెల్లడించారు. ఈశ్వర్ పార్ట్నర్ శంకర్ పట్టుబడాల్సి ఉందని, అతడిని విచారిస్తేనే దీని వెనుక ఇంకా ఎవరెవరూ ఉన్నారనే విషయం బయటకు వస్తుందన్నారు. శంకర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.