సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దొంగల ముఠాలను నిర్వహిస్తున్న ఓ మాజీ కానిస్టేబుల్‌ను ప్రత్యర్థి ముఠాలు మాట్లాడుకుందామని పిలిచి.. కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు భారీ కుట్ర పన్నారు. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన 2010 బ్యాచ్‌కు చెందిన మేకల ఈశ్వర్ దొంగల వ్యవహారం 2022లో నల్గొండ జిల్లా పోలీసుల విచారణలో బయటపడడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తరువాత తన నేర సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తూ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతోనూ సత్సంబంధాలు పెట్టుకున్నాడు.
పిక్ పాకెటింగ్, సెల్‌ఫోన్ స్నాచింగ్స్లు చేయిస్తూ వ్యవస్థీకృత నేర వ్యవస్థకు ఒక నాయకుడిగా ఎదిగాడు. తన గ్యాంగు లాంటి మరో నాలుగు గ్యాంగ్‌లకు కొరకరాని కొయ్యగా మారాడు. తాజాగా, ఈ మాజీ కానిస్టేబుల్‌పై మిగతా గ్యాంగ్ నాయకులు హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి… 2010లో పోలీసు శాఖలోకి వచ్చిన ఈశ్వర్ ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేటతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తూ ఎక్కువగా క్రైమ్ విభాగంలోనే విధులు నిర్వహించాడు.
డిపార్టుమెంట్లోకి ఎంట్రీ కాగానే నేరస్థులతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు. చోరీకి గురైన సెల్ఫోన్లు ఎక్కడుంటాయి.? ఎవరు దొంగతనం చేస్తున్నారనే సమాచారం తెలుసుకొని ఆయా సెల్ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు సేకరించాడు. ఒకపక్క దొంగలతో దోస్తీ చేస్తూనే.. మరోపక్క తాను సేకరించిన ఐఎంఈఐ నంబర్‌తో ఆ దొంగ సెల్‌ఫోన్ కొన్నవారిని గుర్తించేవాడు. ఆ తరువాత వాళ్ల వద్దకు వెళ్లి దొంగ ఫోన్ కొన్నారంటూ బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ ఫోన్‌ను రికవరీ చేసినట్లు నటిస్తూ తిరిగి ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.
దొంగలతో ఉన్న పరిచయాలతో తానే దొంగల ముఠాలను ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్న స్నాచర్లు, ఇతర దొంగలతో తనకున్న పరిచయాలతో దొంగ వ్యాపార నెట్‌వర్క్‌ను బలంగా చేశాడు. ఆయా ప్రాంతాల నుంచి దొంగలను ఇక్కడికి రప్పిస్తూ వారికి తగిన ఏర్పాట్టు చేశాడు. ఒక రాష్ర్టానికి చెందిన వారిని మరో రాష్ర్టానికి పంపిస్తూ.. రోజువారీగా టార్గెట్లు అప్పగించాడు. మార్కెట్లో తనకున్న పరిచయాలతో ఈజీగా దొంగిలించిన ఫోన్లను విక్రయించాడు. ఇలా తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుతూ.. పిల్లలను సైతం దొంగతనంలోకి దింపడం మొదలు పెట్టాడు.
ఇందుకు మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వెళ్లడం.. పేద కుటుంబాలను ఎంచుకొని.. వారి తల్లిదండ్రులకు కొంత అడ్వాన్స్‌గా డబ్బు ఇచ్చి ఉద్యోగం చేయిస్తానంటూ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. ఇందులో మహిళలు కూడా ఉన్నాడు. వారికి ఆశ్రయం కల్పిస్తూ.. రోజుకు రూ. 300 వరకు ఖర్చులకు ఇస్తూ దేవాలయాలు, రద్దీ బస్సులు, కూరగాయాల మార్కెట్లు.. ఇలా అవకాశం ఉన్న ప్రాంతాలకు వారిని పంపిస్తూ సెల్‌ఫోన్, పిక్‌పాకెటింగ్ చేయిస్తూ.. ఈ మాఫియాకు కేంద్ర బిందువుగా మారాడు. 2022లో నల్గొండ పోలీసులకు అతడి గ్యాంగ్ చిక్కింది. వారిని విచారించగా ఆ ముఠా నాయకుడు ఈశ్వర్ అని తేలడంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, ఉద్యోగంలో నుంచి తొలగించారు.
దొంగల ముఠాలను నిర్వహిస్తున్న ఈశ్వర్ లాంటి గ్యాంగ్ లీడర్లు ఇంకా నలుగురైదుగురు ఉన్నారు. ఈశ్వర్ తన దొంగ వ్యాపారాన్ని పెంచుకునేందుకు తన ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం మొదలు పెట్టాడు. దీంతో ప్రత్యర్థుల గ్యాంగ్‌లు పోలీసులకు పట్టుబడుతున్నాయి. ఈశ్వర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన తరువాత హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని సాగిస్తున్నాడు. ప్రత్యర్థి గ్యాంగులు ఈశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే గురువారం రోజున మాట్లాడుకుందామంటూ మందమల్లమ్మ చౌరస్తా సమీపంలోని ఒక బార్లో సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈశ్వర్ ఒంటరిగా వెళ్లాడు.
ప్రత్యర్థులు ఐదారుగురు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ మాటలతోనే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఆ బార్ నుంచి అందరు బయటకు వచ్చి రోడ్డుపై మాట్లాడుకుంటూనే.. ఒక పథకం ప్రకారం అతడిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలకు గురైన ఈశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అసలు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తమ మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉండటంతో ఈశ్వర్‌పై దాడి చేశామంటూ కొందరు మీర్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయారని సమాచారం. అయితే, మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజుతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా.. అలాంటి ఘటనలు ఏమీ జరుగలేదని, ఇది తమ దృష్టికి రాలేదని తెలిపారు.