సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింకు పాల్పడుతున్న ముఠాను కీసర, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి(Thieves arrested) రూ.9.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, సురారానికి చెందిన ఆటో డ్రైవర్ బేగరి వేణుకుమార్, మొబైల్ దుకాణం నిర్వహించే ఘట్కేసర్కు చెందిన చంద్రగిరి సంపత్, ర్యాపిడో రైడర్‌గా పనిచేస్తున్న బాలానగర్‌కు చెందిన పాడ్యి భరత్, సెంట్రింగ్ వర్క్ నిర్వహించే అబ్దుల్ రహీమ్, వ్యాపారం నిర్వహించే అడ్డాల కల్యాణ్‌కుమార్ ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఈ ముఠా దొంగతనాలు చేయడంతో పాటు గంజాయి(Ganja) కూడా స్మగ్లింగ్ చేస్తుంది. ఇదిలాఉండగా మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు కీసర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతుండగా ఈ ముఠా బుధవారం పట్టుబడింది. నిందితులను అరెస్ట్ చేసి విచారించడంతో దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరి వద్ద నుంచి 100 గ్రాముల బంగారం, 264 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు లభించింది, నిందితుల ఇంట్లో 1.25 కిలో గంజాయి కూడా లభ్యమైందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.