కంటోన్మెంట్, సెప్టెంబర్ 4: ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 19 సెల్ఫోన్లతో పాటు ఆటోను సీజ్ చేశారు. విలేకరుల సమావేశంలో బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి బేగంపేట ఏసీపీ రామలింగరాజు వివరాలను వెల్లడించారు. ఎర్రగడ్డకు చెందిన దేవేంద్ర కుమార్ శర్మ గతనెల 31న సాయంత్రం 5.00 గంటలకు బోయిన్పల్లి చౌరస్తా నుంచి సుచిత్ర సర్కిల్‌కు ఆటోలో వెళ్తున్నాడు. ఈ ఆటోలో కూర్చొని ఉన్న తోటి ప్రయాణికుడు బాధితుడి సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితుడు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలు, ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ సాజిద్ మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా బోయిన్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసు స్టేషన్ల పరిధిలో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడింది. నిందితుల నుంచి రికవరీ చేసిన ఐదు సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. ప్రధాన నిందితుడి సాజిద్, ఆటో డ్రైవర్ అమీర్‌తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన అహ్మద్, షఫీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు ఇజాజ్, మహ్మద్, వసీమ్ పరారీలో ఉన్నారు. ఆటో డ్రైవర్ అమర్‌పై ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ పరిధిలో మర్డర్ కేసు కూడా నమోదై ఉంది. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఏసీపీ అభినందించారు.