సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) :
Hyderabad | నెలరోజుల్లోనే హైదరాబాద్‌లో జరిగిన ఘటనలే మూడు ఉన్నాయంటే అక్రమ ఆయుధాల వినియోగం తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. గ్రేటర్లో అక్రమ ఆయుధాలు సమకూర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కారణాలేవైనా తుపాకులు పేలేవరకు పోలీసులకూ తెలియడం లేదు. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి నగరానికి వస్తున్న ఆయుధాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇటీవల నగరంలో జరిగిన సంఘటనలు చూస్తే ఈ పరిస్థితి అర్ధమవుతుంది. ఆయుధాలతో పాటు ఆ దందాలు చేసే వారిపైనా పూర్తి స్థాయిలో నిఘా ఉండకపోవడం మూలాన ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకులు లభిస్తున్నాయి. దీంతో నేరగాళ్లు వీటిని వినియోగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గచ్చిబౌలిలో కాల్పులు జరిఫిన బత్తుల ప్రభాకర్‌కు పెద్ద నేర చరిత్ర ఉంది. అయితే అతడు ఆయుధం వినియోగించడం ఇదే మొదటిసారి.
ఒకప్పుడు ఢిల్లీ, ముంబైలకు ఉత్తరాది నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌కు ఆయుధాల అక్రమ రవాణా పెరిగిందని ఒక పోలీస్ అధికారి చెప్పారు. సహజంగా బెదిరింపులు, దోపిడీలు, కిడ్నాపులు, హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్స్ ఉండాలని నేరస్తులు భావిస్తున్నారు. వెంటవెంటనే సమస్య పరిష్కరించుకోవాలంటే పిస్టల్స్, రివాల్వర్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రౌడీషీటర్లు, నేరస్తుల చేతుల్లోనే 80శాతం వరకు ఆయుధాలు ఉన్నాయని అంచనా. వీటిని రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ర్టాల నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పాతబస్తీలో నేరస్తులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లున్నాయి. హైదరాబాద్ నగరంలో పోలీసుల అనుమతితో పదివేల వరకు ఆయుధాలుంటే.. అనధికారికంగా సుమారు 35వేల వరకు ఉన్నట్లు పోలీసులు అంచనావేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి పలు రాష్ర్టాల నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. అక్రమ ఆయుధాలను రాజస్తాన్‌లోని జయపుర, బిహార్‌లోని గయ, ముంగేర్, పాట్నా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బర్వానీలలో తయారు చేస్తున్నారు. అక్కడి కరుడుగట్టిన ముఠాలు వీటిని తక్కువ ధరకు అందిస్తున్నాయి. ఆయుధాల రవాణాకు రైలుమార్గం ఒక వరంగా మారింది. జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నారు. శివారు రైల్వేస్టేషన్లలో దిగివెళ్లిపోతున్నారు. వీటికి తోడు ట్రాన్స్ పోర్ట్ లారీలు, కొన్నిసార్లు ప్రైవేటు బస్సుల్లోనూ ఇవి నగరానికి వస్తున్నాయి.
నగరానికి ఉత్తరాది నుంచి నగరానికి వలసలు పెరగడంతో ఆయుధాలు తెప్పించుకోవడం సులభమవుతోంది. ఓ పక్క ముఠాలే కాకుండా అక్క డినుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే సమయంలో తమతోపాటు అక్కడి ఆయుధాలను తక్కువ ధరకు కొని ఆ తరవాత వాటిని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీ, ఇతర రాష్ర్టాల వారు తాము తమ ప్రాంతం నుంచి సిటీకి రాకపోకలు సాగించే సమయంలో ఈ దందా చేస్తున్నారు. పోలీసు నిఘా ఎంత పటిష్టంగా పనిచేసినా చివరకు ఎక్కడో ఒక దగ్గర కాల్పుల మోతలు, ఆయుధాల స్వాధీనం వంటి ఘటనలు తరచూగా జరుగుతూనే ఉన్నాయి.
అక్రమ ఆయుధాల ధరలు :
తపంచా : రూ.5వేల నుంచి రూ.8వేల వరకు
రివాల్వర్ : రూ.25వేల నుంచి రూ.50వేలు
పిస్టల్: రూ.30వేల నుంచి రూ.60వేలు
ఆటోమేటెడ్ పిస్టల్ : రూ.80వేలకు పైగా
ఆటోమేటెడ్ రివాల్వర్ : రూ.90వేలకు పైగా