సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, డిప్లొమా .. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీదైనా సరే లక్ష ఇస్తే చాలు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు నకిలీ తయారీదారులు. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులు ఆరుగురిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర, అన్నామలై యూనివర్సిటీలకు చెందిన ఈ సర్టిఫికేట్లు తయారుచేశారు. వీటిపై కొందరు విదేశాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒరిజినల్ మాదిరిగానే ఉండడంతో పాటు ఇవి అన్ని ఉద్యోగాలకు పనిచేస్తాయంటూ నమ్మబలికి గ్యాంగ్ సభ్యులు ఏజెంట్ల ద్వారా అవసరమున్నవారిని గుర్తించి పెద్ద ఎత్తున డబ్బులు లాగి వారికి అంటగడ్తున్నారు.
మంగళవారం సికింద్రాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డిసిపి కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ డిసిపి సుధీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఫేక్ సర్టిఫికేట్ ముఠాలో వజహల్ అలీ నకిలీ సర్టిఫికేట్లతో దొరికాడని తెలిపారు. ఈ క్రమంలో విచారణ జరుపుతుంటే నకిలీ సర్టిఫికేట్స్ తయారీలోరాజీఉల్లాఖాన్, హబీబ్ ఉన్నట్లు వజహత్ అలీ చెప్పాడని, ఇంకొందరు కూడా ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని అన్నారు. మంగళవారం పరేడ్ గ్రౌండ్ దగ్గరికి గ్యాంగ్ సభ్యులు అందరూ వచ్చినట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి వాళ్లను పట్టుకున్నామని సుధీంద్ర తెలిపారు. వారి వద్ద ఉన్న నకిలీ సర్టిఫికేట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు అత్యాశకు పోయి ఇలాంటి షార్ట్‌కట్ పద్ధతిలో ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకోవద్దని డీసీపీ సుధీంద్ర సూచించారు. ఈ సమావేశంలో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జంగయ్య, ఫిల్మ్‌నగర్ ఎస్హెచ్ఓ ఎం శ్రీనివాసులు, ఎస్ఐలు అరవింద్ గౌడ్, మహ్మద్ జహెద్, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.