సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): మూతపడిన కోళ్ల ఫారంలో గుట్టుచప్పుడు కాకుండా ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని తయారు చేసి, నగరంలోని కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. అబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీ నుంచి పెద్దఎత్తున నగరానికి ఆల్ఫాజోలం సరఫరా అవుతున్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శుక్రవారం దాచ్‌పల్లి, అద్దంకి, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ చౌరస్తా తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇందులో భాగంగా అద్దంకి నుంచి నగరం వైపు వస్తున్న మారుతి కారును తనిఖీ చేయగా.. అందులో 700 గ్రాముల ఆల్ఫాజోలం లభించింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న రాజశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీలోని ప్రకాశం జిల్లా, దర్శి తాలుక, ముళ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరం అనే మారుమూల గ్రామంలో మూతపడి ఉన్న కోళ్ల ఫారంలో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బృందాలు ఆ కోళ్లఫారంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆల్ఫాజోలం తయారు చేస్తున్న చైతన్యకృష్ణను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి 5.535కిలోల ఆల్ఫాజోలం, రసాయన తయారీ పరికరాలను సీజ్ చేశారు. పట్టుబడిన మత్తు పదార్థం విలువ రూ.55లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే నిందితుడు ఏడు దశల్లో ఉండే ఆల్ఫాజోలంను ఐదు దశల్లో తయారు చేసి సికింద్రాబాద్‌లో కల్లు కాంపౌండ్లు నిర్వహించే బిచ్చు వెంకటేశం, కామారెడ్డిలో కల్లు కాంపౌండ్లు నిర్వహించే ప్రసాద్గౌడ్లకు విక్రయిస్తాడని నిందితులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్న బిచ్చు వెంకటేశం, ప్రసాద్గౌడ్లపై కేసులు నమోదు చేసినట్లు ఈడీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సీఐ నాగరాజు బృందం పాల్గొన్నది.