సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బైక్ కొంటారు.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ కాగానే.. సెకండ్ హ్యాండ్ బైక్‌గా పేర్కొంటూ విక్రయిస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల రుణాలతో బైక్‌లు తీసుకొని.. ఆరు నెలల్లోనే ఆ బైక్‌లను మాయం చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వ రాయితీని పొందుతూ, మరోపక్క ఫైనాన్స్ సంస్థలకు ఎగనామం పెడుతూ.. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలుదారులను ఈ ముఠా మోసం చేస్తున్నది. ఈ ముఠాకు సంబంధించిన నయా మోసాలు మలక్‌పేట, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త విచారణలో వెలుగులోకి వచ్చాయి.
డబీర్‌పురకు చెందిన మిర్జా బకర్ అలీ బేగ్, సయ్యద్ తన్వీర్ హుస్సేన్ రజ్వీ, సచిన్, జాఫర్ అలీ మూస్వి స్నేహితులు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొని, విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడంతో నయా దందాకు స్కెచ్ వేశారు. ఎలక్ట్రిక్ బైక్‌లు కొంటే ప్రభుత్వం నుంచి 5 నుంచి 15 శాతం వరకు రాయితీ వస్తుందని తెలుసుకున్నారు. దీంతో తమకు తెలిసిన వారిని, బంధువులను సంప్రదించారు. ‘మీ గుర్తింపు కార్డులు ఇవ్వండి.. మీ పేరుతో బైక్ కొంటాం.. ఆ తరువాత ఫైనాన్స్ ఇప్పిస్తాం.. వాయిదాలు కూడా చెల్లిస్తాం.. అన్ని మేమే చూసుకుంటాం’.. అంటూ ఒప్పందాలు చేసుకున్నారు. బైక్ కొనుగోలు కోసం గుర్తింపు కార్డు ఇచ్చిన వారికి కొంత డబ్బు ఇచ్చారు.
డబ్బు రావడంతో చాలా మంది వీరి ట్రాప్‌లో పడ్డారు. టీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోలును ప్రారంభించారు. మేము సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయిస్తాం.. మాకు తెలిసిన కస్టమర్లు ఎలక్ట్రిక్ బైక్‌లను అడుగుతుంటారు.. వారిని నేరుగా మీ షోరూంకు తీసుకు వస్తున్నామంటూ.. వాహనాల విక్రయ యజమానులను నమ్మించారు. ఫైనాన్స్ సంస్థలు కూడా వీరి తెచ్చే కస్టమర్లకు సునాయసంగా రుణాలు ఇచ్చారు. బైక్ కొన్న తరువాత ఒకటి నుంచి మూడు నెలల్లో ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్ము బైక్ కొనుగోలుదారు ఖాతాలో డిపాజిట్ అవుతుంది. రాయితీ రాగానే ఆ బైక్‌లను సెకండ్ హ్యాండ్లో విక్రయించడం మొదలుపెట్టారు. నిందితులకు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించడంలో అనుభవం ఉండటంతో కొనుగోలుదారులను కూడా ఈజీగా ఈ ముఠా ట్రాప్ చేసి బైక్‌లను విక్రయించారు.
ఈ ముఠా ఫైనాన్స్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నది. బైక్ కొనుగోలుకు ఫైనాన్స్ తీసుకొని.. రెండు మూడు నెలల వాయిదాలు చెల్లిస్తుంది. ఆ తరువాత వాహనాన్ని ఇతరులకు అమ్మేస్తారు. అక్కడి నుంచి వాయిదాలు చెల్లించరు. ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు బైక్‌ల కోసం కొనుగోలుదారుల చిరునామాల చుట్టూ తిరిగితే కనిపించరు. అడిగితే తమకేమీ తెల్వదంటూ దబాయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రోడ్లపై ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన బైక్‌లు ఏజెంట్లకు కనిపిస్తాయి.
ఆపి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అడగగా.. డబ్బులు పెట్టి కొన్నాం.. రేపో మాపో నా పేరుపై కూడా నంబర్ మారుతుంది.. అంటూ సమాధానమిస్తున్నారు. దీంతో ఆయా ఫైనాన్స్ సంస్థలు.. ఫైనాన్స్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లకు కొనుగోలు చేసిన వారి వివరాలు, అనుమానితులకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించారు. ఈ మోసంపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడగా.. భారీ రాకెట్ బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 44.80 లక్షల విలువైన 28 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.