నకిలీ సర్టిఫికెట్ల సరఫరా ముఠా అరెస్ట్
ఎస్ఆర్కేయూ ప్రొఫెసర్ కేతన్ సింగ్ ద్వారానే దందా
పట్టుబడిన వారిలో ముగ్గురు విద్యార్థులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఇటీవల పట్టుబడిన మధ్యప్రదేశ్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్‌సింగ్ ద్వారా దందా నడిపిస్తున్నది. అరెస్టయిన వారిలో ముగ్గురు సర్టిఫికెట్ల సరఫరాదారులుండగా, మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. జడ్బర్లకు చెందిన తాటిపల్లి రవికాంత్‌రెడ్డి మీర్పేట్లో నివాసముంటూ రాంనగర్ సాధన కాలేజీలో అడ్మిన్‌గా, మలక్‌పేటకు చెందిన మహ్మద్ ఆసీఫ్ అలీ కూడా అదే విభాగంలోనే పనిచేస్తున్నాడు. మరోవైపు సరూర్‌నగర్‌కు చెందిన ఉప్పరి రంగరాజు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏజెంట్‌గా పనిచేస్తూ..అవసరమైన వారికి నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తుంటాడు. ముఠాగా ఏర్పడిన ఈ ముగ్గురు కలిసి.. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించి.. డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు.
ఆ విద్యార్థుల వివరాలు సేకరించి..
కాలేజీ నుంచి మధ్యలో వెళ్లిపోయిన వారు, ఫెయిల్ అయిన వారు, సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్న వారి వివరాలు సేకరించే ఈ ముఠా సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి అసలైన సర్టిఫికెట్లు పాత తేదీల్లో ఇప్పిస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటారు. ఆ వివరాలను కేతన్‌సింగ్‌కు పంపిస్తారు. బీటెక్, బీఎస్సీ, బీకాం ఇతర డిగ్రీలకు సంబంధించిన సర్టిఫికెట్లకు రూ. 3 లక్షల నుంచి ఒక లక్ష వరకు వసూలు చేస్తారు. ఇటీవల ఈ ముగ్గురు 9 మంది విద్యార్థులకు సంబంధించిన డేటాను సేకరించి కేతన్‌సింగ్‌కు పంపించారు. అందులో ఐదుగురు విద్యార్థులకు సర్టిఫికెట్లు వర్సిటీ నుంచి అందించారు. మిగతా వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డబ్బు చెల్లించిన వారికి సర్టిఫికెట్లు సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం ముషీరాబాద్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ముఠా సభ్యులు రవికాంత్‌రెడ్డి, మహ్మద్ ఆసీఫ్ అలీ, ఉప్పరి రంగరాజుతో పాటు ముగ్గురు విద్యార్థులను పట్టుకున్నారు. 40 రబ్బర్ స్టాంప్‌లు, మూడు నకిలీ సర్టిఫికెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.