శేరిలింగంపల్లి, నవంబర్ 15: జిరాక్స్ సెంటర్ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసు వివరాలు వెల్లడించారు. హఫిజ్‌పేట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాజీద్(37) గచ్చిబౌలి ఇందిరానగర్‌లో శ్యామ్ జిరాక్స్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అందులో గంటా రాజీవ్ (34) టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. కాగా కొంతకాలంగా నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, పదో తరగతి మార్కుల మెమోలు, మెడికల్ రిపోర్టులు, హోంగార్డు ఐడీ కార్డులు, థెరఫీ సర్టిఫికెట్లు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు, జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు జిరాక్స్ సెంటర్‌పై దాడిచేశారు. నకిలీ సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్, సీపీయు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు సాజీద్తోపాటు గంటా రాజీవ్, మేడి కిరణ్‌కుమార్, పల్లపుర్ల శరత్‌లను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శ్రీధర్ వివరించారు. చిరుగురి రాజా, పిరంపల్లి మురళీధర్, జెల్లా నరేష్, పుష్పా గౌతమ్, రజనీకాంత్, రాజేష్‌లపై కేసు నమోదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని వాడిన వారు నేరం చేసినట్లే అవుతుందని ఈ సందర్భంగా ఎసీపీ శ్రీధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎస్ఓటీ సీఐ అంజిరెడ్డి, గచ్చిబౌలి సీఐ హబుబుల్లాఖాన్, ఎస్ఐ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.