అల్వాల్, సెప్టెంబర్ 17: సెంట్రింగ్ డబ్బాలు చోరీ చేస్తున్న దుండగులను అరెస్ట్ చేసినట్టు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాల గంగిరెడ్డి వెల్లడించారు. బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో సీఐ ప్రశాంత్, డీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో నిందితులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్లారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలకు గురవుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమెదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ 17న నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు జూబ్లీహిల్స్‌కు చెందిన చెత్త సేకరించే కత్తుల గోపాల్, కత్తుల సుధీర్, చోడి దుర్గచైతన్య, బంటి, చోడి మన్నారావు, గద్ద సాయివరుణ్, ఇనుము వ్యాపారులు మహమ్మద్ జహీర్ద్దీన్, అద్నాన్ పాషాలుగా గుర్తించినట్లు చెప్పారు. కత్తుల గోపాల్, సుధీర్ చెత్త సేకరించుకుంటూ స్క్రాప్ వ్యాపారం చేస్తారని, అల్వాల్, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జీహెచ్ఎంసీ చెత్త సేకరించే వాహనంలో రాత్రి పూట ఇళ్ల నిర్మాణ ప్రదేశాల దగ్గర తిరుగుతూ సెంట్రింగ్ బాక్సులను దొంగతనం చేసి అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారని వెల్లడించారు.
నేరస్తులను 3రోజుల పాటు వంద సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, వారు ఉపయోగించిన జీహెచ్ఎంసీ చెత్త సేకరించే వాహనాన్ని జూబ్లీహిల్స్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. ఓల్డ్ అల్వాల్ చౌరస్తా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన చెత్త సేకరించే వాహనం, 280 సెంట్రింగ్ బాక్సులు, 4 మొబైలు ఫోన్లు, రూ.3లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.