సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : నగరంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అన్నారు. గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్‌కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 11 రోజుల పాటు జరుగనున్న ఉత్సవాల్లో శాంతి భద్రతల సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పోలీస్, విద్యుత్, రవాణా, ఆర్టీసీ , మెట్రో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. గత సంవత్సరం కంటే 10 శాతం విగ్రహాలు పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వరదనీరు నిలువకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే నిమజ్జనానికి బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
మట్టి విగ్రహాలను పూజించాలి : మంత్రులు
మట్టి విగ్రహాలను పూజించేలా ప్రచారం నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డి. శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. 7 జోన్ల పరిధిలో జోనల్ కమిషనర్, డీసీపీలతో మండపాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిషారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 7 నుంచి 17 మధ్య జరిగే గణేశ్ ఉత్సవాల సందర్భంగా లా అండ్ ఆర్డర్ విషయంలో మంత్రు లు అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగ లోపు రోడ్లు మరమ్మతులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు నిమజ్జనం కోసం వాహనాలు సిద్ధం చేయాలని.. టసర్ వాహనాలు, డ్రైవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు తెలిపారు. ట్రాఫిక్ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తెలిపారు. రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, జంక్షన్ల వద్ద మండపాలు ఏర్పాటు చేయొద్దని ఉత్సవ కమిటీలకు తెలుపాలన్నారు.
5 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ..
ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనానికి 22 ప్లాట్ ఫారంలు ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ వెల్లడించారు. ట్యాంక్ బండ్ పై 33 క్రేన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 100 స్టాటిస్టిక్ క్రేన్లు, 150 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో 10,500 మంది శానిటేషన్ సిబ్బంది, వ్యర్థాల తరలింపునకు 100 టిప్పర్స్ , 20 జేసీబీలు ఏర్పాటు చేయన్నుట్లు వివరించారు. ఈసారి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి 5 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఉత్సవాల సమయంలో అర్ధరాత్రి వరకు మెట్రో నడిపిస్తామని, నిమజ్జనం రోజు అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల వరకు నడుస్తాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 650 వరకు బస్సులు నడుపనున్నట్లు అధికారులు వివరించారు. ఉత్సవాల కోసం 57 ట్రాన్స్ఫార్మర్లు, 22 మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, 3457 మంది విద్యుత్ సిబ్బంది పని చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అంబులెన్స్‌లు, ప్రత్యేక వైద్య సిబ్బంది, ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.