సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటు కనుల పండవగా జరుపుకునే వినాయక చవితికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్స్‌ను సిద్ధం చేయగా, శోభాయాత్ర జరిగే 303.3 కి.మీల మార్గంలో ప్రతి 3-4 కి.మీల మేరకు ఒక్క బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అదికారులు ప్రకటించారు.
తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను ప్రజలు స్థానికంగానే నిమజ్జనాలు చేసేందుకు గతంలో మాదిరిగానే జీహెచ్ఎంసీ ప్రత్యేక కొలనులను సిద్ధం చేశామని చెప్పారు. దీంతో పాటు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనులను నిమజ్జనాలకు వినియోగించనున్నామని తెలిపారు. ప్రతి మండపం వద్ద చెత్త సంచులు, బిన్స్ అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అరకొరగా మట్టి విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఏటా తరహాలోనే జీహెచ్ఎంసీ ఈ ఏడాది లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఐతే విగ్రహాల తయారీ, పంపిణీలో ప్రణాళిక లోపించింది. గత శుక్రవారమే ఏజెన్సీ ఎంపికకు టెండర్లు పిలవడం, ఆశించిన స్థాయిలో విగ్రహాల తయారీ లేక అరకొర పంపిణీలో ముగించారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో మట్టి విగ్రహాల కోసం ఉద్యోగులు పోటీ పడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్ చివరి రోజు చేతులెత్తేయడంలో ఈ సమయం తలెత్తిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఐతే వార్డు కార్యాలయాలకు మట్టి గణపతులు సక్రమంగా చేరకపోవడంతో కార్పొరేటర్లు మండిపడ్డారు.
నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ బడా గణేశ్‌ను చూడడానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఖైరతాబాద్‌కు వచ్చే అవకాశమున్నందున వినాయకచవితి పర్వదినమైన బుధవారం నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
వీవీ విగ్రహం నుంచి మింట్కాంపౌండ్కు రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను అటువైపు అనుమతించకుండా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్వైపు మళ్లిస్తామని, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా బడాగణేశ్ వచ్చే ప్రజలను ఇక్బాల్ మినార్వైపు మళ్లిస్తామని చెప్పారు.
బడాగణేశ్ దర్శనానికి నెక్లస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలను రేస్రోడ్, ఎన్టీఆర్ఘాట్, హెచ్ఎండీఏ పార్కింగ్ బిసైడ్ ఐమాక్స్ థియేటర్, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్‌లో, సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ప్రెమిసెస్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. బడాగణేశ్ దర్శనానికి ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చే విశ్వేశ్వరయ్యభవన్‌లో పార్క్ చేయాలని సూచించారు. ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని జోయల్ డేవిస్ తెలిపారు.
నేడు మహాగణపతి ప్రతిష్ఠాపన తొలి పూజ చేయనున్న గవర్నర్
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్ఠాపనోత్సవం బుధవారం జరగనున్నది. ఈ ఏడాది 71వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 69 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 10.30 గంటలకు తొలిపూజ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి 75 అడుగుల జంధ్యం, నూలు కండువా, గరికమాల, పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు. మంగళవారం రాత్రి నుంచి స్వామి వారి పూర్తి విగ్రహం దర్శనం కల్పించారు. కాగా, గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.