e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home హైదరాబాద్‌ అవిఘ్నమస్తు!

అవిఘ్నమస్తు!

 • భాగ్యనగరంలో కొలువుదీరిన గణపతులు
 • తారస్థాయిలో ప్రతిమల అమ్మకాలు
 • గతేడాది కంటే పెరిగిన విక్రయాలు
 • అంతేస్థాయిలో మండపాల ఏర్పాటు
 • ఊపందుకున్న అనుబంధ వ్యాపారాలు
 • కరోనా తగ్గుముఖంతో దుకాణాలు కళకళ

విఘ్నాలు తీర్చే వినాయకుడు నగరమంతా కొలువుదీరుతున్నాడు.. నవరాత్రులు విశేష పూజలందుకునేందుకు సన్నద్ధమయ్యాడు.. కరోనాతో గతేడాది కళ తప్పిన వినాయక సంబురం ఈ ఏటా కోలాహలంగా జరగనుంది. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మహానగరమంతా పండుగ సందడి నెలకొన్నది. కొద్దిరోజులుగా నెమ్మదిగా సాగిన గణపతుల విక్రయాలు గురువారం తారస్థాయిలో జరిగాయి. రెండేండ్లతో పోల్చితే ఈసారి ప్రతిమల విక్రయాలు పెరగగా, భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటవుతున్నాయి. పండుగ అనుబంధ వ్యాపారం జోరుగా సాగడంతో గురువారం అర్ధరాత్రి వరకు మహానగర వీధులు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. ఇంధన ధరల మోతతో విగ్రహాల రవాణా చార్జీలు మోత మోగగా, అదును చూసి వ్యాపారులు పూల ధరలు పెంచారు. గతేడాది నిలిచిన బాలాపూర్‌ లడ్డూ వేలం ఈసారి నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.

ఖైరతాబాద్‌ గణనాథుడికి గవర్నర్‌ తొలిపూజ

పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్న ఖైరతాబాద్‌ లంబోదరుడికి శుక్రవారం ఉదయం 7 గంటలకు గవర్నర్‌ తమిళిసై దంపతులు తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొంటారు. స్వామివారికి 60 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించనున్నారు.

నిఘా నీడన నగరం

- Advertisement -

గ్రేటర్‌వ్యాప్తంగా వైభవంగా జరిగే వినాయక వేడుకలకు మూడు కమిషనరేట్ల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి విద్రోహక చర్యలు జరగకుండా నిఘా ఉంచారు. ప్రతిక్షణం సీసీ కెమెరాల ద్వారా కదలికలను పర్యవేక్షించడంతోపాటు సున్నిత ప్రాంతాల్లో బలగాలను సిద్ధంగా ఉంచుతున్నారు.

గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య కొలువుదీరే గణేశుడి పండుగతో నగరంలో సందడిగా మారింది. వినాయక చవితి కోలాహలం మొదలైంది. వినాయక విగ్రహాల ప్రతిష్టంభన నుంచి నిమజ్జనం వరకు నగరమంతా ఆధ్యాత్మికతతో పరిఢవిల్లనున్నది. తీరొక్క ఆకృతులతో గణపతి ప్రతిమలు.. ఆకర్శించే మండపాలతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. గణేశ్‌ ఉత్సవాలపై ఆధారపడిన ఎంతో మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే పూల మార్కెట్లు, మిఠాయి దుఖానాలు, లంబోధరుడి భక్తి సామగ్రి, డెకరేషన్‌, స్టేజీ నిర్మాణం, సౌండింగ్‌, విగ్రహ ప్రతిమల విక్రయాలు తదితర వ్యాపారాలు జోరందుకున్నాయి. విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టించడం మొదలుకొని నిమజ్జనోత్సవం చేసే వరకు లారీలు బిజీగా ఉండనున్నాయి. గత ఏడాది కరోనాతో గణేశుడి వేడుకలకు అంతరాయం ఏర్పడటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారి ప్రభుత్వం వేడుకలకు పూర్తి అనుమతులు ఇవ్వడంతో వ్యాపారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సంబురాలు అంబరాన్నంటనున్నాయి.

ఈసారి వేలంలో బాలాపూర్‌ లడ్డూ..!

వినాయక చవితి పండుగ షురూ అయ్యిందంటే చాలు లడ్డూ వేలంపైకి అందరి దృష్టి వెళ్తుంది. అందులోనూ ప్రతి ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయే బాలాపూర్‌ లడ్డూ అంటే భక్తులకు ఎనలేని ఇష్టం. అయితే గత ఏడాది కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంను నిర్వాహాకులు నిలిపివేశారు. ఆ లడ్డూను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రదానం చేశారు. వినాయక చవితికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో ఈసారి లడ్డూ వేలం ఉంటుందని బాలాపూర్‌ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. 2019లో రూ.17.60లక్షలు పలికిన లడ్డూ ఇప్పుడు ఎంత ధర పలుకనుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మండప నిర్వాహకులకు డిస్కం సూచనలు

గణేశ్‌ మండప నిర్వాహకులు తప్పనిసరిగా మండపానికి అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలి.
మండపాలకు సరఫరా గావించే విద్యుత్‌ తీగలపై ఎలాంటి పదార్థాలను, పూలదండలను వేయవద్దు.
విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు సొంతంగా విద్యుత్‌ స్తంభాలను ఎక్కవద్దు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సిబ్బందిని మాత్రమే వినియోగించుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యుత్‌ సిబ్బందికి 1912 ఫోన్‌ ద్వారా తెలియజేయాలి. మండపాల వద్ద ఫైర్‌సేఫ్టీ పరికరాలు తప్పకుండా ఉంచుకోవాలి. రెండు ఇసుక బకెట్లు ఉంచుకోవాలి.

నిమజ్జనానికి వెయ్యి వాహనాలు

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 9 ( నమస్తే తెలంగాణ ) : గణపతి నిమజ్జనానికి సమకూర్చాల్సిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ముందుగానే దృష్టి సారించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి వెయ్యి వాహనాలను నిమజ్జనానికి కేటాయిస్తున్నట్టు హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగనాయక్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం జేటీసీతో సమావేశమయ్యారు. నిమజ్జనానికి సమకూర్చాల్సిన వాహనాలపై చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, పటాన్‌చెరువు, సంగారెడ్డి వ్యాప్తంగా వినాయక ప్రతిమలను నిమజ్జనానికి తరలించేందుకు వాహనాలను కేటాయిస్తామని జేటీసీ హామీచ్చారు. ట్రక్స్‌, లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇలా అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పది మంది ఆర్టీఓలు, సుమారు 30మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉత్సవ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. మండపాల నిర్వాహకులందరికీ వాహనాలను ఈనెల 18న అందిస్తామని వివరించారు.

దర్శనానికి సిద్ధమైన రుద్ర రూపుడు

ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌ 9 : ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. అయితే గత దశాబ్ద కాలంగా రాష్ట్ర గవర్నర్‌ తొలి పూజ చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ శుక్రవారం తొలి పూజ చేస్తారు. ఆమెతోపాటు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పూజలు నిర్వహిస్తారు.

గుర్రపు బగ్గీలో 60 అడుగుల కండువా..

ఖైరతాబాద్‌ గణేశుడికి నియోజకవర్గం పద్మశాలి సంఘం తన ఆనవాయితీ కొనసాగింపుగా ఈ ఏడాది 60 అడుగుల కండువా, జంధ్యం (యజ్ఞోపవితం), గరికమాలతో పాటు ఉప మండపాల్లోని దేవతలకు పట్టువస్ర్తాలను సమర్పిస్తున్నది. శుక్రవారం ఉదయం 7గంటలకు లక్డీకాపూల్‌లోని రాజ్‌దూత్‌ చౌరస్తా నుంచి గణేశుడి మండపం వరకు డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోళ్లు, కోలాటాలతో గుర్రం బగ్గీలో ఉంచిన ఆ కానుకలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. స్వామి వారికి 60 అడుగుల జంధ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పి.పార్ధసారధి, కండువాను రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవులు, గరికమాలను రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌ సమర్పిస్తారని ఖైరతాబాద్‌ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్‌ తెలిపారు.

మహమ్మారి ఉంది.. నిర్లక్ష్యం వద్దు..!

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ, జాగ్రతలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గణేశ్‌ నవరాత్రుల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ పలు మార్గదర్శకాలతో కూడిన సూచనలను జారీచేసింది. పండుగల సమయంలో షాపింగ్‌ చేయడం, ఇతరాత్ర వస్తువుల కొనుగోళ్ల కోసం సూపర్‌మార్కెట్లు వంటి షాపులలో పెద్ద సంఖ్యలో గుమ్మిగూడటం జరుగుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని కొవిడ్‌ నియమాలు పాటించాలని సూచించింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలు గుమ్మిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పలు సూచనలు జారీచేసింది.

మాస్కులు తప్పనిసరిగా ధరించాలి

వినాయక మండపాల వద్ద ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. ఖైరతాబాద్‌ వినాయకుడితో పాటు బేగంబజార్‌ వంటి ప్రముఖ గణేశ్‌ మండపాలను దర్శించుకునే భక్తులు క్యూలైన్‌లలో ఖచ్చితంగా భౌతికదూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. ప్రతి మండపం వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను ఆశ్రయించాలి. ఈ లక్షణాలున్నవారు నిర్ధారణ పరీక్షలు జరిగే వరకు మండపాల వద్దకు వెళ్లకపోవడం ఉత్తమం. కరోనా అనుమానితులు లేదా నిర్ధారణ జరిగిన రోగులు ఉత్సవాలకు దూరంగా ఉండి, ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలి. వారితో కలిసి తిరిగిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రసాద వితరణల వద్ద జాగ్రతలు పాటించాలి. పూజలు, నిమజ్జనం, ఊరేగింపుల సమయంలో భౌతిక దూరం పాటించాలి. ముఖ్యంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఏదేని వస్తువును తాకిన వెంటనే చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. గణపయ్య చి్రత్ర ప్రదర్శన మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన గణనాథుడి చిత్ర ప్రదర్శనను గురువారం ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.లక్ష్మి, సీనియర్‌ చిత్రకారులు డాక్టర్‌ లక్ష్మణ్‌, బి.నగేశ్‌గౌడ్‌లతోకలిసి ప్రారంభించారు.

ఈసారి ఉపాధికి ఢోకాలేదు

వినాయక మండపాలు వేసే వారికి డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే నగరంలో పదివేల మంది లేబర్లు మండపాలు వేస్తున్నారు. ఒక కాంట్రాక్టర్‌ కింద 30 మంది ఉంటారు. వికారాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నర్సాపూర్‌, మెదక్‌ నుంచి వర్కర్లు వచ్చి మండపాలు వేస్తున్నారు. గత ఏడాది కొవిడ్‌ కారణంగా వ్యాపారంపై దెబ్బ పడింది. రూ. 3 నుంచి 4 లక్షల వరకు నష్టం వచ్చింది. ఈసారి మళ్లీ చవితి సందడితో వ్యాపారం గాడిలో పడింది. – కొంటు ముకుందం, మేదరి మహేంద్ర సంఘం, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

లారీలకు బుకింగ్‌లు పెరిగాయి

ప్రతి ఏడాది వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచే విగ్రహాలను తరలించడానికి బుకింగ్‌లు వచ్చాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సందడి షురూ అయ్యింది. విగ్రహాల తరలింపు డిస్టెన్స్‌ను బట్టీ ధర నిర్ణయించాం. సుమారు 30వేల లారీలు వినాయక చవితి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ సారి మట్టి విగ్రహాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. లారీలు సరిపోకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించే ఏర్పాట్లు చేస్తాం.-ఎస్‌. యాదయ్య గౌడ్‌, ఉపాధ్యక్షుడు, తెలంగాణ స్టేట్‌ లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.

పూల వ్యాపారం మంచిగుంది

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల కోసం పూలు ఎక్కువగా గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు. ఈ సారి వ్యాపారం గతంతో పోలిస్తే 60 శాతం పెరిగింది. బంతి, చామంతి పూలు విరివిగా అమ్ముడుపోతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. మండపాల అలంకరణ, ఇంట్లో పూజల కోసం భక్తులు పూలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా వ్యాపారం లేక పూలు పారబోయాల్సిన దుస్థితి వచ్చింది. ఈసారి మా వ్యాపారం మంచిగా సాగుతుంది. – కృష్ణాగౌడ్‌, పూల వ్యాపారి

పర్యావరణాన్ని కాపాడాలి: మేయర్‌

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 9 : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కోరారు. గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని ఎన్‌బీటీనగర్‌లో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కె.కేశవరావుతో కలిసి మట్టి గణపతులను మేయర్‌ పంపిణీ చేశారు.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 70వేల మట్టి ప్రతిమలు పంపిణీ

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 9 (నమస్తే తెలంగాణ ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా హెచ్‌ఎండీఏ చేపట్టిన మట్టి గణపతుల పంపిణీకి అనూహ్య స్పందన లభించింది. పర్యావరణ గణపతులకే జనం ఆసక్తి కనబర్చారని, గురువారం నాటికి 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

రెప్పవాల్చకుండా.. అన్నిచోట్లా నిఘా

 • గణపతి మండపాలకు క్యూఆర్‌ కోడ్‌, జియో ట్యాగింగ్‌
 • నేటి నుంచి నిమజ్జనం వరకు.. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ప్రతి క్షణం పర్యవేక్షణ
 • ఇప్పటికే మూడు కమిషనరేట్లలో 13 వేల మండపాలు
 • శుక్రవారం మరిన్ని పెరిగే అవకాశం
 • సాంకేతికతతో గణేశ్‌ నవరాత్రుల బందోబస్తు

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 9(నమస్తే తెలంగాణ): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది అంతంత మాత్రంగానే వేడుకలు జరిగాయి. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో కరోనా మార్గదర్శకాలను పా టిస్తూ నిర్వాహకులు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు కూడా వినాయక మండపాల నిర్వాహకులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు జరిపి ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచనలు చేశారు. మండపాల ఏర్పాటుపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ట్రై పోలీస్‌ కమిషనరేట్ల వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ ఫారాలు అందుబాటులో పెట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో గురువారం నాటికి 13 వేల మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరింత మంది శుక్రవారం నాటికి సమాచారం ఇస్తారని పోలీసులు భావిస్తున్నారు.

ఏ రోజు.. ఏ విగ్రహం.. నిమజ్జనానికి..!

పోలీసులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇచ్చిన మండపాల నిర్వాహకులకు క్యూఆర్‌ కోడ్‌ను కేటాయిస్తున్నారు. మండపం ఏర్పాటు చేసిన తరువాత జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి జియో ట్యాగింగ్‌ ఆధారంగా రూట్లు కేటాయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ రూట్‌లో ఎన్ని మండపాలు ఉన్నాయనేది పక్కా సమాచారం పోలీసులకు తెలుస్తుంది. దీంతో బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేస్తారు. నిమజ్జనం సందర్భంగా కూడా ఆయా మండపాల నుంచి విగ్రహాలను నిమజ్జనానికి తరలించే మార్గం ముందే తెలుపుతుండటంతో అందుకు అనుగుణంగా పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తారు. జియో ట్యాగింగ్‌, క్యూఆర్‌ కోడ్‌లతో ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఎన్ని విగ్రహాలున్నాయి.., ఏ రోజు.. ఏ విగ్రహం.. నిమజ్జనానికి ఎక్కడికి తరలివెళ్తుంది, ఏ రూట్‌లో వెళ్తుందనే పూర్తి సమాచారం ఉండటంతో సామాన్య పౌరులకు ట్రాఫిక్‌ ఇబ్బందుతు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు.

సీసీసీలో నుంచి పర్యవేక్షణ

గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్టమైన సాంకేతిక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ రూట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వీటితో పాటు నగర వ్యాప్తంగా, ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సుమారు 7 లక్షలకుపైగా ఉన్న సీసీ కెమెరాలను ఆయా పోలీస్‌ కమిషనరేట్లలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లు(సీసీసీ), డీసీపీ, ఏసీపీ, ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మినీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేసి అక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా 25వేల మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement