Hyderabad | హైదరాబాద్ : మానసిక స్థితి సరిగా లేని ఓ ఆటోడ్రైవర్ మింగిన 7 షేవింగ్ బ్లేడ్లను గాంధీ ఆసుపత్రి జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. మౌలాలికి చెందిన ఆటోడ్రైవర్ రియాజుద్దీన్ ఈ నెల 16న ఏడు షేవింగ్ బ్లేడ్లను మింగాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రియాజుద్దీన్‌ను పరీక్షించిన జనరల్ సర్జరీ విభాగం వైద్యులు ఆహారం ఇవ్వకుండా కేవలం మందులు, ఫ్లూయిడ్స్ ఇస్తూ వచ్చారు. ముందుగా ఎండోస్కోపీ ద్వారా బ్లేడ్లను బయటకు తీయాలనుకున్నా, వాటిని తొలగించే క్రమంలో కడుపులో అన్నవాహిక, జీర్ణాశయం, పేగులకు గాయాలయ్యే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచి వైద్యం అందించారు. అయితే అదృష్టవశాత్తు జీర్ణాశయంలో ఎటువంటి గాయాలు కాలేదు.. చివరికి మలద్వారం ద్వారా రియాజుద్దీన్ మింగిన 7 బ్లేడ్లు పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో క్లిష్టమైన ఈ సమస్యకు అరుదైన వైద్యం అందించి రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు అభినందనలు అందుకున్నారు.