గాజులరామారం, డిసెంబర్ 24 : కొలిచే భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గాజులరామారం చిత్తారమ్మ జాతరకు ఆలయం ముస్తాబవుతున్నది. సంక్రాంతి తరువాత వచ్చే జనవరి 20 నుంచి 27 వరకు జరిగే అమ్మవారి వార్షిక ఉత్సవాల (జాతర)కు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేస్తుంది. ఈ జాతర కన్నుల పండుగగా సాగనున్నది. సుమారు లక్ష మందికి పైగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధవుతున్నారు. నగరంలో జరిగే లాల్ దర్వాజ , సికింద్రాబాద్ మహంకాళి జాతర ఉత్సవాలకు ఏ మాత్రం తీసిపోకుండా సాగే ఈ జాతర సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి. ఒకనాడు చిన్న పల్లెటూరి గ్రామదేవతగా వెలసిన అమ్మవారు.. నేడు కోట్లాది భక్తుల కోరికలను తీర్చుతూ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి జాతరకు వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటారు.
నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పచ్చని పంట పొలాలు వాటిని తడుపుతూ పారే చెరువు కాలువల హొయలు మధ్యలో గట్టుపై వెలసిన అమ్మవారు.. ఆ ఊరి ఇలవేల్పుగా పూజలందుకుంటూ ఏయేటి కాయేడు తన మహిమలతో భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటున్నది. గ్రామ యువకులందరూ కలిసి హనుమాన్ యువజన సంఘాన్ని స్థాపించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతూవస్తు న్నారు. ఈ క్రమంలోనే చిత్తారమ్మ దేవి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ఆలయ కమిటీని ఏర్పాటు చేసుకుని.. గ్రామస్తులందరూ ఏకమై ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం అమ్మవారి జాతర నిర్వహించాలని తీర్మానించుకుని ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నాటి నుంచి ప్రతియేట గ్రామం అభివృద్ధి చెందడంతో పాటు ఆల యం వృద్ధి చెందుతూ వస్తుంది. అమ్మవారి పూజలు, ఉత్సవాలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రకా రం జరుపుతారు. భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటూ చిత్తారమ్మకు ఒడి బియ్యం సమర్పించడం నాటినుంచి అనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా బోనాల సమర్పణ , పోత రాజుల నృత్యాలు, శివసత్తులు, డప్పుల దరువులతో కోలాహాలంగా సాగనున్నది.