Balapur | బడంగ్ పేట, జనవరి 1: బాలాపూర్లో ఉన్న చెరువులు, కుంటలను అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేస్తున్నారని బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్, తిమ్మని గిరీశ్, నీరుడు శ్రీరాములు, పగడాల ఉమేశ్, సుధాకర్ ఆరోపించారు. బాలాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న పురాతన గేదల కుంట కట్టను తొలగించి చెరువు ఆనవాళ్లు లేకుండా చుట్టు ప్రహరీ ఏర్పాటు చేశారని, చెరువును మట్టితో పూడ్చివేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. బాలాపూర్ రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ .74లో ఉన్న ప్రభుత్వ భూమిని అనుసరించి గేదల కుంట ఉందన్నారు. సర్వే నంబర్. 74లో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు సర్వే చేసిన తర్వాత మూడు ఎకరాల భూమి ఉన్నదని నిర్ధారించారన్నారు. ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ఆర్సీఐ ప్రధాన రహదారిని అనుసరించి గేదల కుంట ఉందన్నారు. రోడ్డు సైడ్ కనిపిస్తుందన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి ప్రహరీ ఏర్పాటు చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించారని తెలిపారు. ప్రహరీతో పాటు గేట్లు ఏర్పాటు చేశారన్నారు. అధికార పార్టీ అండతో దర్జాగా కబ్జాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు భయపడి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గేదల కుంటను కాపాడే వరకు పోరాటం చేస్తామన్నారు.